- కనీసం రూ. 5 వేల నుంచి 35 వేల వరకు అదనంగా పెంపు
- సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి సిబ్బంది కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: పెరిగిన జీతాలు బుధవారం ఆర్టీసీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆర్టీసీ సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 11 శాతం ఫిట్‌మెంట్‌తో ఈ జీతాలు పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీన మధ్యాహ్నం తర్వాత కార్మికుల, ఉద్యోగుల ఖాతాల్లో ఈ జీతాలు జమయ్యాయి. తమ జీతాలు ఎంత మేర పెరిగాయనే ఆతృతతో ఉదయం నుంచే బ్యాంక్ మెసేజ్‌ల కోసం కార్మికులు ఎదురుచూశారు.
శ్రామిక్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) స్థాయి అధికారి వరకు ఈ జీతాల పెంపు వర్తించింది. శ్రామిక్‌కు రూ.5 వేలకు పైగానే పెరిగాయి. ఈడీ స్థాయి అధికారులకు రూ.30 నుంచి రూ.35 వేల వరకు పెరిగాయి. ఎంతో కాలంగా ఎదురుచూసిన ఫిట్‌మెంట్ పెంపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెరగడం, వాటిని అందుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, సూపర్‌వైజర్స్ అసోసియేషన్, పలు యూనియన్ల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆర్టీసీలోని మొత్తం 38 వేల పైచిలుకు ఉద్యోగులకు ఈ ఫిట్‌మెంట్ పెంపు వర్తించింది. ఈ పెంపుతో ప్రతి నెల ప్రభుత్వానికి రూ.3 కోట్లు అదనపు భారం పడనుంది.
