Sanju Samson: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం లక్షలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ ని అప్పుడే ఆడించడానికి తొందరపడకూడదని జట్టు భావించడంతో గత 3 మ్యాచ్‌ల్లోనూ ఈ కుర్రాడికి ఛాన్స్ రాలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే మ్యాచ్‌లో వైభవ్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం సంజు శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం అవ్వడంతో.. శాంసన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సంజు శాంసన్ వైఫల్యాలు:
కేవలం కొన్ని నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్‌లో 300 కంటే ఎక్కువ రన్స్ చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు, భారత్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలబెట్టిన సంజు.. అంతర్జాతీయ సిరీస్‌లకు రాగానే ఫ్లాప్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐర్లాండ్ టూర్ మొదటి మ్యాచ్‌లో రెండో ఓవర్ తొలి బంతికే 5 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయిన సంజు, రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ ఫ్లాప్ షో ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగింది. చెస్టర్-లే-స్ట్రీట్‌లో జరిగిన తొలి టి20లోనూ రెండో ఓవర్‌లోనే కేవలం ఒక్క పరుగు చేసి శాంసన్ వికెట్ కోల్పోయాడు.
విదేశీ పిచ్‌లపై సంజు రికార్డు:
వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్లలో సంజు శాంసన్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మాట వాస్తమే కానీ, ఆ మ్యాచ్‌లన్నీ భారత పిచ్‌లపైనే జరిగాయి. భారత్ దాటి బయటకు వస్తే సంజు రికార్డులు చాలా దారుణంగా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా వెలుపల ఆడిన గత 10 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, అందులో సంజు రెండు అద్భుత సెంచరీలు కొట్టినప్పటికీ.. మిగిలిన ఇన్నింగ్స్‌లలో ఏకంగా 5 సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు వరుసగా 2, 5, 1 రన్స్ మాత్రమే ఉండటంతో విదేశీ పిచ్‌లపై సంజు బ్యాటింగ్ టెక్నిక్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
