కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు.. లక్షా 80 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం : మంత్రి జూపల్లి

కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు.. లక్షా 80 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం : మంత్రి జూపల్లి

కేసీఆర్ పాలనలో.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని.. కేసీఆర్ చేసిన ఆ అప్పులకు ఇప్పుడు లక్షా 80 వేల కోట్ల రూపాయలు వడ్డీనే చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అప్పులపై చర్చకు సిద్ధం అని.. సవాల్ కు కట్టుబడి గన్ పార్క్ దగ్గరకు వచ్చానని.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఎవరూ రాలేదన్నారు మంత్రి జూపల్లి. గాంధీభవన్ కు వెళుతున్న సమయంలో.. గన్ పార్క్ దగ్గరకు మాజీ మంత్రి హరీశ్ రావు వస్తున్నట్లు సమాచారం ఉండటంతో.. నేరుగా గన్ పార్క్ దగ్గరకే వచ్చానని.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా అప్పులపై ఇక్కడే చర్చించుకుందాం అంటూ సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. 

కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పు అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు అని.. మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని.. 3 లక్షల 50 వేల కోట్లు మాత్రమే అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు మంత్రి జూపల్లి. ఆర్థిక శాఖ కార్యదర్శి ఇచ్చిన లెక్కలనే నేను చెబుతున్నానని.. కేసీఆర్ చేసిన అప్పులకు లక్షా 80 వేల కోట్ల రూపాయలు వడ్డీనే కడుతున్నామని.. ఇదంతా ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బులతోనే చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 

మంత్రి జూపల్లి చెప్పింది తప్పు అని కేసీఆర్ తో చెప్పించండి.. నేను రాజీనామా చేస్తా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి జూపల్లి.  3 లక్షల 50 వేల కోట్ల రూపాయల అప్పు అని అంటున్నారని.. ఇది అబద్దం అని.. 8 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవం అన్నారు మంత్రి జూపల్లి. ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చిన వివరాలు తప్పు ఎలా అవుతాయని వివరించారు మంత్రి జూపల్లి. అప్పులపై చర్చించటానికి ఇప్పుడు గన్ పార్క్ దగ్గరకు వచ్చాను.. అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు అయినా వెళతా.. లేకపోతే అక్కడి నుంచి కేసీఆర్ ఉన్న ఫాంహౌస్ కు రమ్మన్నా వెళతా అంటూ సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. 

గన్ పార్క్ దగ్గరకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ రాకపోవటంతో కొద్దిసేపు వెయిట్ చేసి.. మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి జూపల్లి.