ప్రస్తుతం ఐరోపా (Europe) అంతటా వడగాలులు వీస్తున్న, మన భారతీయులకు ఎండలు కొత్తేమీ కాదు. ప్రతి ఏటా వేసవిలో ఉత్తర, మధ్య భారత దేశాల్లోని చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు 45°C మార్కును దాటేస్తుంటాయి. అయితే, AQI.in సంస్థ విడుదల చేసిన మే 2026 తాజా రిపోర్ట్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా (Etawah) నగరం ఈ ఏడాది దేశంలోనే అత్యంత వేడి నగరంగా రికార్డు సృష్టించింది.
ప్రపంచంలోనే టాప్-10లో చోటు!
AQI.in 'మే 2026 ప్రపంచ టాప్-10 అత్యంత వేడి నగరాల' లిస్టులో ఇటావా నిలిచింది. ఈ నగరంలో మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 48.3°C గా నమోదైంది. ఈ నెల మొత్తం మీద ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 46.3°C గా రికార్డైంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర భారతదేశంలో ఈ ఏడాది ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటావాలో ఇంత తీవ్రమైన వేడి ఎందుకు
ఉత్తరప్రదేశ్ నైరుతి భాగంలో ఉండే ఇటావా భౌగోళికంగా 'అర్ధశుష్క ప్రాంతం' (Semi-arid region) కిందకు వస్తుంది. ఇక్కడ ఎండలు ఇంతలా మండిపోవడానికి ముఖ్య కారణాలు:
*రుతుపవనాలు రాకముందు వీచే పొడి గాలులు.
*గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండటం.
*ఆకాశంలో మేఘాలు పెద్దగా లేకపోవడం వల్ల నేరుగా పడే ఎండ తీవ్రత.
*ఉత్తర భారతదేశంలోని వేడి మైదాన ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉండటం.
సాధారణంగా ఇక్కడ నైరుతి రుతుపవనాలు వచ్చే ముందు, అంటే మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 45°C దాటడం సర్వసాధారణం.
ఇటావాలో చూడదగ్గ ప్రదేశాలు
ప్రస్తుతం ఎండల వల్ల వార్తల్లో నిలిచిన, చలికాలంలో సందర్శించడానికి ఇటావాలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవేంటంటే
*ఇటావా సఫారీ పార్క్
*లోయలు, రకరకాల వన్యప్రాణులకు నిలయమైన ఫెమస్ చంబల్ నది.
*ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించే పురాతన ఆలయాలు, స్థానిక మార్కెట్లు.
అయితే ఎండలు ఎక్కువగా ఉండే మే, జూన్ నెలల్లో ఇక్కడికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఈ నగరాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలం అత్యంత అనువైన సమయం. ఎందుకంటే అప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇటావాకు ఎలా చేరుకోవాలి?
రైలు మార్గం: ఇటావా జంక్షన్ రైల్వే స్టేషన్ కి ఢిల్లీ, కాన్పూర్, లక్నో వంటి ప్రధాన నగరాల నుండి నేరుగా రైళ్లు ఉన్నాయి.
రోడ్డు మార్గం: ఈ నగరం 'ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే' పక్కనే ఉండటం వల్ల రోడ్డు ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది.
విమాన మార్గం: ఇటావాకు దగ్గర్లోని ప్రధాన విమానాశ్రయాలు చూస్తే కాన్పూర్ ఇంకా లక్నోలలో ఉన్నాయి.
భారతదేశంలో వేసవి తీవ్రతకు ఇటావా ఒక ఉదాహరణగా నిలిచింది. మీరు గనుక ఇక్కడి వన్యప్రాణులను, స్థానిక సంస్కృతిని చూడాలనుకుంటే మాత్రం చల్లని శీతాకాలంలోనే ప్లాన్ చేసుకోండి!
