సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్

 సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్
  • మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికపై.. రంగంలోకి ఎంపీ చామల 
  • మోత్కూరు,  తిర్మలగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల 

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా మోత్కూరు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికపై లీడర్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జీలు, డీసీసీ ప్రెసిడెంట్లు మధ్య సమన్వయం లోపించింది. అయితే  మోత్కూరు మున్సిపాలిటీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తనకు సంబంధించిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారని, పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోలేదని ఫిర్యాదులు అందాయి.

భువనగిరి ఎంపీ చామల  కిరణ్​కుమార్​ రెడ్డికి సంబంధించిన వారు నామినేషన్లు వేస్తే.. వారికి పోటీగా కాంగ్రెస్​కు చెందిన ఇతరులతో నామినేషన్లు వేయించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.  తిర్మలగిరి మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపికపైనాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.  

రంగంలోకి ఎంపీ చామల

తన పార్లమెంట్​పరిధిలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఈ పరిణామాలతో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి రంగంలోకి దిగారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్​ గుడిపాటి నరసయ్య, రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్​తో భువనగిరిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోత్కూరు, తిర్మలగిరి మున్సిపాలిటీల అభ్యర్థుల ఎంపికపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​ వ్యవహరిస్తున్న తీరుపై మిగిలిన వారు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో తాను అభ్యర్థుల ఎంపిక సరిగానే నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే మందుల సామెల్​ చెప్పుకొచ్చారు.

మోత్కూరు మాజీ మున్సిపల్​ చైర్మన్​ కవిత భర్త లక్ష్మీ నర్సింహారెడ్డితో ఎందుకు నామినేషన్​ వేయించారని ఎంపీ ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే సామెల్​మీటింగ్​నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మళ్లీ మీటింగ్​కు వచ్చి తన ఎంపిక సరిగానే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం పని చేసిన వారిని విస్మరించడం సరికాదని ఎంపీ సూచనలు చేశారు. అనంతరం  రెండు మున్సిపాలిటీలకు చెందిన అభ్యర్థుల లిస్టును 
విడుదల చేశారు.