హైదరాబాద్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అందరితో చర్చించి, వారి గౌరవాన్ని పెంచేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామని వెల్లడించారు.
సోమవారం (ఫిబ్రవరి 2) ‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి.
బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి’ అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు.
దేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్ భవనాన్నిరావి నారాయణ రెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారు. 60 ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల అనంతరం రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.
రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి దక్కడం సముచితమని అన్నారు. “నిర్వాహకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. తొలితరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలితరంలో ఎస్. జైపాల్ రెడ్డి , సుదర్శన్ రెడ్డి వంటి వారు తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చారు. సుదర్శన్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు పోషించిన పాత్ర మనందరికీ గుర్తుంది. వారి అనుభవాలు పరిపాలనలో ఉపయోగపడుతున్నాయి” అని వివరించారు.
హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
