- చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
- యుద్ద ప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి
- ఆగస్టు 14లోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాలి
- అర్హులకు అన్యాయం జరుగదు
- ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదు
- సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలకు చెక్
- ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నిషేధిత ఆస్తుల జాబితా POB (Prohibited Properties List) లేదా 22ఎ (22-A) భూముల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక చిక్కులను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఫోర్జరీ, బోగస్ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకు.. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అన్ని జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్ ,లే-అవుట్ అనుమతుల డాక్యుమెంట్లన్నింటినీ ఆగస్టు 14వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, పహానీలు కూడా సబ్ రిజిస్ట్రార్‌కు యాక్సెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పిఓబీ దరఖాస్తులను తహశీల్దార్‌కు పంపకుండా, ఇకపై నేరుగా కలెక్టర్‌కే పంపాలని స్పష్టం చేశారు.పీఓబీ జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను గుడ్డిగా తిరస్కరించకుండా, 3 రోజుల సమయం తీసుకొని సరైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.సబ్ రిజిస్ట్రార్లకు అదనపు విచక్షణాధికారాలు ఉండవని, ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేలా వారి అధికారాలను పరిమితం చేయాలని తేల్చిచెప్పారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.వచ్చిన దరఖాస్తుల్లో ఏది జెన్యూన్ అనేది గుర్తించి, అర్హులైన బాధితులకు యుద్ధప్రాతిపదికన ఊరట కల్పించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
