నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ మెస్ భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయని నిరసిస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. నార్కట్‌పల్లి–నల్గొండ ప్రధాన రహదారిపై యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్, హాస్టల్ వార్డెన్లు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
75 శాతం హాజరు నిబంధనలను కఠినంగా అమలు చేసే వీసీ, విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనలో విద్యార్థి నాయకులు మోహన్, ఛత్రపతి, మౌనేశ్, సుధీర్, అజయ్, సతీశ్, శంకర్, సూర్య, విజయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
