T20 World Cup 2026: ఒకే గ్రూప్‌లో మూడు పటిష్టమైన జట్లు.. వరల్డ్ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్' అంటే ఇదే

T20 World Cup 2026: ఒకే గ్రూప్‌లో మూడు పటిష్టమైన జట్లు.. వరల్డ్ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్' అంటే ఇదే

ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ చరిత్రలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ చోటు చేసుకుంది . టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. ఇదిలా ఉంటే గ్రూప్ దశలో మ్యాచ్ లను చూడడం క్రికెట్ ఫ్యాన్స్ కు కొంత బోరింగ్ గా అనిపించవచ్చు. అయితే ఒక్క గ్రూప్ మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. 

టీ20 వరల్డ్ కప్ 2026 లో గ్రూప్- డి ని గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు. మొత్తం 5 జట్లలో మూడు పెద్ద జట్లు ఉండడమే ఇందుకు కారణం. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా ఈ గ్రూప్ లో ఉన్నాయి. సూపర్- 8 కి చేరుకోవాలంటే టాప్-2 లో నిలవాలి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పటిష్టమైన జట్లు ఉండడంతో ఈ గ్రూప్ లో ఏ రెండు జట్లు ముందుకు వెళ్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. గత ఏడాది రన్నరప్ గా నిలిచిన సౌతాఫ్రికా ఈ సారి కూడా అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియాతో సిరీస్ ఆడిన న్యూజిలాండ్ జట్టు ఎంత బలంగా కనిపిస్తుంది. 

ఆఫ్ఘనిస్తాన్ గత రెండేళ్లలో చాలా బలమైన జట్టుగా ఎదిగింది. చివరిసారిగా వెస్టిండీస్, అమెరికా వేదికలుగా 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా ఆడి సెమీస్ కు చేరుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించి తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు అర్హత సాధించారు. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాపై చిత్తుగా ఓడడంతో ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. అయితే ఈ సారి ఉపఖండపు పిచ్ లు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ను తక్కువగా అంచనా వేస్తే పెద్ద జట్లు మూల్యం చెల్లిచుకోవాల్సిందే. ఓవరాల్ గా ఈ సారి గ్రూప్-డి రసవత్తరంగా మారడం ఖాయంగా మారింది. 

టీ20 ప్రపంచ కప్ గ్రూపులు:

గ్రూప్ ఎ: ఇండియా, యుఎస్ఎ, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్

గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్

గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్

గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఎఇ.

తొలిసారి 20 జట్లతో టీ20 వరల్డ్ కప్: 

ఈ సారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా (USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.