బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్, దర్శకుడు విశాల్ భరద్వాజ్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. గతంలో 'కమీనే', 'హైదర్' వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబో.. ఇప్పుడు 'ఓ రోమియో' (O Romeo) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యంగా చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. ముంబైకి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ కుమార్తె పంపిన లీగల్ నోటీసు ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వివాదం ఏమిటి?
ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్, ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు లీగల్ నోటీసులు పంపారు. తన తండ్రి హుస్సేన్ ఉస్తారా వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో ప్రతికూలంగా చూపిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పరిహారంగా రూ. 2 కోట్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
Also Read : చిన్నారి పాలిట దేవదూతగా మారిన నటి శృతి హాసన్!
కథేంటి? రియల్ లైఫ్ ఇన్స్పిరేషనా?
చిత్ర యూనిట్ ఈ సినిమా ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా తీశారో అధికారికంగా చెప్పనప్పటికీ.. జనవరి 10న విడుదలైన టీజర్లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా(Inspired by Real Events) అని పేర్కొనడం అనుమానాలకు బలం చేకూర్చింది. గతంలో 2018లోనే విశాల్ భరద్వాజ్, ఇర్ఫాన్ ఖాన్, దీపికా పదుకొణెతో ఒక సినిమా ప్లాన్ చేశారు. అందులో ఇర్ఫాన్ పాత్ర పేరు కూడా ఉస్తారానే. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకంలోని 'ఫెమ్ ఫేటల్' కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని ఇండస్ట్రీ టాక్. అయితే, దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాత్రం ఇది ఎవరి బయోపిక్ కాదని, కేవలం కొన్ని స్ఫూర్తిదాయక అంశాలను తీసుకుని కొత్త కథను సిద్ధం చేశామని గతంలోనే క్లారిటీ ఇచ్చారు.
భారీ తారాగణం.. బిగ్గెస్ట్ క్లాష్!
'ఓ రోమియో' సినిమాలో కేవలం షాహిద్ మాత్రమే కాదు, భారీ తారాగణం నటిస్తోంది. తృప్తి డిమ్రీ, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్ తివారీ వంటి స్టార్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ మూవీ షాహిద్ కపూర్, - విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది. అదే రోజు షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన 'తూ యా మై' (Tu Yaa Main) కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది.
సినిమా రంగంలో గ్యాంగ్‌స్టర్ కథలకు, వివాదాలకు విడదీయలేని ముడి ఉంది. హుస్సేన్ ఉస్తారా కుటుంబం చేసిన ఆరోపణలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఏడు రోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీవ్రతరం చేస్తామని సనోబర్ షేక్ హెచ్చరించారు. ఈ లీగల్ చిక్కులు దాటుకుని 'ఓ రోమియో' ప్రేమికుల రోజు కానుకగా సజావుగా విడుదలవుతుందో లేదో వేచి చూడాలి!
