Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు.. కోట్ల నష్టం జరిగిందంటూ వ్యాపారవేత్త ఆరోపణలు!

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు.. కోట్ల నష్టం జరిగిందంటూ వ్యాపారవేత్త ఆరోపణలు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు 'స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్' డైరెక్టర్లకు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్‌కు సంబంధించి నమోదైన చీటింగ్ (మోసం) కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, తాము కేవలం బ్రాండ్ లైసెన్స్ మాత్రమే పొందామని కంపెనీ గతంలో స్పష్టం చేసింది. అయినప్పటికీ.. వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఇచ్చిన కంప్లైంట్లో సల్మాన్పై ఆరోపణలు రావడంతో ఇపుడు ఈ కేసు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. 

అసలు వివాదం ఏంటి?

చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఈ కేసును దాఖలు చేశారు. మణిమాజ్రాలో 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించేందుకు కంపెనీ తప్పుడు హామీలు ఇచ్చి తనను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

అరుణ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం, ఆయన సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఇందులో షోరూమ్ ఏర్పాటు కోసమే దాదాపు రూ.1 కోటి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని అన్ని నిబంధనలను తాను పాటించానని.. అయితే, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ నుంచి ఆశించిన స్థాయిలో వ్యాపార సహకారం అందలేదని ఆరోపించారు.

అలాగే, జ్యువెలరీ సరఫరా చేసే స్టోర్ ఫిబ్రవరి 2020 నుంచి మూతపడటంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. షోరూమ్ ప్రారంభోత్సవానికి స్వయంగా సల్మాన్ ఖాన్ హాజరవుతారని హామీ ఇచ్చినా, చివరకు ఆయన బావ ఆయుష్ శర్మను మాత్రమే పంపారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల తనకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కంపెనీ వివరణ...

ఈ ఆరోపణలపై గతంలో స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ స్పందిస్తూ, ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. 2015లో సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ నుంచి 'బీయింగ్ హ్యూమన్' బ్రాండ్ లైసెన్స్‌ను మాత్రమే తమ సంస్థ పొందిందని తెలిపింది. షోరూమ్‌ల నిర్వహణ, మార్కెటింగ్, వ్యాపార కార్యకలాపాలన్నీ పూర్తిగా తమ కంపెనీ పరిధిలోనే జరిగాయని పేర్కొంది. ప్రస్తుతం కోర్టు సమన్లు జారీ చేయడం విచారణ ప్రక్రియలో భాగం మాత్రమే. ఈ కేసులో వచ్చిన ఆరోపణలు ఇంకా కోర్టులో విచారణలో ఉన్నందున, వాటిపై ఫైనల్ డెసిషన్ రావాల్సి ఉంది.