ఇండియాలో మోస్ట్ పాపులర్ స్టంట్ ఆధారిత రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ (Khatron Ke Khiladi). ప్రస్తుతం ఈ స్టంట్ షో 15వ సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ షోని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కలర్స్ టీవీ ఛానెల్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో ఇపుడు కంటెస్టెంట్లలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
గౌరవ్ ఖన్నా తర్వాత కరణ్ వాహి..
స్టంట్ ఆధారిత రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి 15’ షూటింగ్‌లో మరోసారి కంటెస్టెంట్లు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు గౌరవ్ ఖన్నా తనకు తగిలిన గాయాల వీడియోను పంచుకోగా, తాజాగా నటుడు కరణ్ వాహి రబ్బర్ బుల్లెట్ కూడా గాయపడినట్లు పోస్ట్ చేశాడు. ఈ షోలో ఓ స్టంట్ కారణంగా వీపు భాగంలో తగిలిన గాయాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను చేసిన స్టంట్లలో ఇదే అత్యంత కఠినమైనదని పేర్కొన్నారు కరణ్. ఈ క్రమంలోనే ఇలాంటి సాహసాలను ఎవరూ అనుకరించవద్దని అభిమానులకు హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టంట్‌పై కరణ్ వాహి ఎమోషనల్ పోస్ట్..
బాలీవుడ్ నటుడు కరణ్ వాహి (Karan Wahi) స్టంట్ సమయంలో అయిన గాయాల ఫొటోలను షేర్ చేస్తూ షోలో ఎదురైన కఠిన పరిస్థితులను వెల్లడించారు. కరణ్ వాహి తెలిపిన వివరాల ప్రకారం, తాను పాల్గొన్న అన్ని సీజన్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైన, శారీరకంగా తీవ్రమైన నొప్పిని కలిగించిన సీజన్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్ రౌండ్‌లో భాగంగా నిర్వహించిన రబ్బర్ బుల్లెట్ స్టంట్ తనకు అత్యంత కఠినమైన అనుభవంగా నిలిచిందని చెప్పారు.
ఈ స్టంట్‌లో కరణ్ వాహితో పాటు గౌరవ్ ఖన్నా, విశాల్ ఆదిత్య సింగ్, శగున్ శర్మ పాల్గొన్నారు. స్టంట్‌లో భాగంగా కంటెస్టెంట్లపై వెనుక వైపు నుంచి రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపగా, వీపు భాగంలో తీవ్ర గాయాలు, కమిలిన గుర్తులు ఏర్పడ్డాయని కరణ్ వెల్లడించారు. ఈ స్టంట్ అనంతరం తన శరీరంపై ఏర్పడిన గాయాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇలాంటి సాహసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రయత్నించవద్దని అభిమానులకు సూచించారు.
కాగా, ఈ సీజన్‌లో గౌరవ్ ఖన్నా, కరణ్ వాహి, అవిష్ మిశ్రా, ఒర్రి (Orry), జాస్మిన్ భాసిన్, రుబినా దిలాయ్ తదితర ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు. షోలో జరుగుతున్న సాహసోపేత స్టంట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ, కంటెస్టెంట్లకు గాయాలు కావడం చర్చనీయాంశంగా మారింది.
కరణ్ వాహి ఎవరు?
బాలీవుడ్ నటుడు కరణ్ వాహి టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, హోస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 2004లో ప్రసారమైన 'రిమిక్స్' సీరియల్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 'దిల్ మిల్ గయే', 'చన్నా మేరేయా' వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
టీవీ షోలతో పాటు కరణ్ వాహి కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ముఖ్యంగా 'దావత్-ఏ-ఇష్క్' (2014), 'హేట్ స్టోరీ 4' (2018) సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా 'డాన్స్ ఇండియా డాన్స్', 'ఇండియన్ ఐడల్' వంటి పలు రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం కరణ్ 'ఖత్రోన్ కే ఖిలాడి 15'లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు.
