సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం స్టార్ కిడ్ అనే ముద్రను చెరిపేసుకుని, తనదైన శైలిలో ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో సితార అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ డిస్‌ప్లేను ప్రారంభించింది. ఈ వేడుకలో భారతీయ సంస్కృతి, కళా నైపుణ్యం ఉట్టిపడేలా 10,000కు పైగా విశిష్టమైన డిజైన్లను ప్రదర్శించారు. అయితే, ఈ వేడుక మొత్తానికి అసలైన ఆకర్షణగా నిలిచింది మాత్రం సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని.
సితార హాఫ్ శారీ కలెక్షన్
ఈ ప్రదర్శనలో సితార కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, PMJ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ర్యాంప్‌పై అడుగుపెట్టింది. ప్రత్యేకంగా రూపొందించిన ‘సితార హాఫ్ శారీ జ్యువెలరీ కలెక్షన్’ను ఆమె ధరించింది. ఒక అమ్మాయి బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే మధుర ఘట్టాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్‌ను రూపొందించారు. దక్షిణాది సంప్రదాయ ఆభరణాలు ధరించిన సితారను చూస్తుంటే సాక్షాత్తు ఒక యువరాణి ర్యాంప్‌పై నడిచి వస్తున్నట్లుగా ఉందని అతిథులు ప్రశంసించారు.
తండ్రి బాటలో..!
సితార చిన్న వయసులోనే కెమెరా ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది PMJ జ్యువెలరీ ప్రకటనతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన లిటిల్ ప్రిన్సెస్.. ఆ ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. తన విజయానికి మూలకారణం తన తల్లిదండ్రులేనని సితార ఎప్పుడూ చెబుతుంటుంది. ముఖ్యంగా తన మొదటి యాడ్ చూసినప్పుడు తండ్రి మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారని ఆమె గతంలో పంచుకుంది. ప్రస్తుతం సితార డ్యాన్స్, మోడలింగ్, సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. అటు రాబోయే రోజుల్లో సితార వెండితెరపై కూడా వెలిగిపోతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
