హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లాపూర్ భవాని నగర్లో నకిలీ డాక్టర్ సూర్య వెంకట కృష్ణ(39)ను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సూర్య వెంకటకృష్ణ గత కొంతకాలంగా మల్లాపూర్లో డాక్టర్గా చలామణి అవుతున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సూర్య వెంకటకృష్ణ గుంటూరులో ఒక వైద్యుడి దగ్గర కాంపౌండర్గా చేరి అనంతరం హైదరాబాదుకు చేరుకొని మల్లాపూర్లో డాక్టర్ అవతారం ఎత్తాడు.
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఈ నకిలీ డాక్టర్ కాసుల కక్కుర్తితో గత కొంతకాలంగా వైద్యం చేస్తూ అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. ఈ నకిలీ వైద్యుడు ప్రస్తుతం నాచారం పోలీసుల అదుపులో ఉన్నాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ : మిర్యాలగూడలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కంటైనర్
ఎస్ఓటి పోలీసుల దాడుల్లో హైదరాబాద్ సిటీలో ఈ నకిలీ డాక్టర్లు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివి డాక్టర్గా చలామణి అవుతున్న వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ బీరప్పగడ్డ శ్రీనగర్ కాలనీలో ‘అంజలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్న బానోతు శ్రీను డాక్టర్గా ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండా మెడికల్ షాపు నిర్వహిస్తున్నారని తేలడంతో పలు మెడికల్ పరికరాలు, మందులు, పలు కిట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
