ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇండియా ఏ జట్టు యూఎస్ఏతో మ్యాచ్ ఆడుతోంది. నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా కుర్రాళ్ళు బ్యాటింగ్ లో చెలరేగి ఆడారు. నారాయణ్ జగదీశన్ (55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. నారాయణ్ జగదీశన్ 104 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుష్ బడోని కేవలం 26 బంతుల్లోనే 60 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, నారాయణ్ జగదీశన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 4 ఓవర్లలోనే 43 పరుగులు జోడించారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన ప్రియాంష్ ఆర్య 13 బంతుల్లోనే 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మతో కలిసి జగదీశన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు తిలక్ వర్మ.. మరోవైపు జగదీసన్ బౌండరీలతో హోరెత్తించడంతో ఇండియా స్కోర్ శరవేగంగా కదిలింది. రెండో వికెట్ కు వీరిద్దరూ ఏకంగా 113 పరుగులు జోడించడం విశేషం. ఈ దశలో 38 పరుగులు చేసి మంచి టచ్ లోకి వచ్చిన తిలక్ వర్మ పెవిలియన్ చేరుకున్నాడు.
ఆయుష్ బడోని రాకతో స్కోర్ వేగం మరింత వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో జగదీశన్ తన సెంచరీ మార్క్ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్ లో బదోనీ కేవలం 26 బంతుల్లోనే 60 పరుగులు చేసి అదరగొట్టాడు. కేవలం నలుగురికి మాత్రమే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. బ్యాటింగ్ ఆడిన వారు అందరూ సత్తా చాటారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని బ్యాట్ పట్టిన తిలక్ వర్మ 24 బంతుల్లోనే 38 పరుగులు చేసి టచ్ లోకి రావడం సానుకూల అంశం. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్, జస్దీప్ సింగ్, శుభం రంజనే తలో వికెట్ పడగొట్టారు.
An innings full of class! 👏
— Star Sports (@StarSportsIndia) February 2, 2026
N. Jagadeesan’s brilliant 104 off 55 guides India A to a massive total of 238/3 💪
Now watch the bowlers in action! 🔥
📺📲 #T20WorldCup Warm-up Match 👉 #INDAvUSA LIVE NOW on JioHotstar pic.twitter.com/SB1vKB7SrC
