T20 World Cup 2026: వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటికంటే అప్పుడే 10 శాతం బెటర్‌గా ఉంది: అనీల్ కుంబ్లే

T20 World Cup 2026: వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటికంటే అప్పుడే 10 శాతం బెటర్‌గా ఉంది: అనీల్ కుంబ్లే

2026 టీ20 వరల్డ్ కప్ కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జట్టు అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు గత రెండేళ్లలో తిరుగులేని విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఇండియాపై అంచనాలు పెరిగిపోయాయి.

2024లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత భారత జట్టు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా..వరుసగా సిరీస్ విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకుంటుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ విధ్వంసానికి మారు పేరులా మారారు. సూర్య తన టాప్ ఫామ్ అందుకోవడం టీమిండియాకు కొండంత బలం. మిడిల్ ఆర్డర్ లో దుమ్ములేపడానికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్ సిద్ధంగా  ఉన్నారు. బౌలింగ్ లో కూడా డీసెంట్ గా కనిపిస్తుంది. 

Also Read : ఆ ఇద్దరు బౌలర్లను ఎదర్కోవడం కష్టంగా అనిపించేది

వరల్డ్ బెస్ట్ టీ20 బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రూపంలో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. అయితే టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనీల్ కుంబ్లే మాత్రం 2024లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు బెటర్ గా ఉందని సూచించాడు. కుంబ్లే మాట్లాడుతూ " అనుభవం గురించి మాట్లాడితే ఇండియా ఇద్దరు దిగ్గజాలు విరాట్, రోహిత్‌లను మిస్ అవుతున్నారు. బ్యాలన్స్ గురించి మాట్లాడితే ఇప్పటి జట్టు కూడా బాగుంది. ఎందుకంటే బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి జట్టు సవాలుతో కూడుకున్నది. పరిస్థితుల పరంగా 2024 చాలా భిన్నంగా ఉంది. నేను బహుశా 2024 జట్టును ఈ జట్టు కంటే 10 శాతం బెటర్ గా ఉందని భావిస్తున్నాను". అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.