TOEFL పరీక్షలో తనకి బదులు మరొకరితో పరీక్ష రాయించి.. అడ్డంగా బుక్కైన విద్యార్థిని.. మూడు నెలల జైలు!

 TOEFL పరీక్షలో తనకి బదులు మరొకరితో పరీక్ష రాయించి.. అడ్డంగా బుక్కైన  విద్యార్థిని.. మూడు నెలల జైలు!

హాంకాంగ్‌లో చదువుతున్న 22 ఏళ్ల చైనా విద్యార్థిని, తన బదులు మరొకరితో ఇంగ్లీష్ పరీక్ష రాయించినందుకు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష పడింది. పరీక్షలో పాస్  కావడం కోసం ఇలా చేయడం వల్ల కష్టపడి చదివే ఇతర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కోర్టు సీరియస్ అయ్యింది.

అసలు ఏం జరిగిందంటే... ఫుజియాన్ ప్రాంతానికి చెందిన హువాంగ్ జిన్యి అనే విద్యార్థిని, హాంకాంగ్‌లోని లింగ్నాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు TOEFL అనే ఇంగ్లీష్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంది. అయితే ఆమె స్వయంగా  పరీక్ష రాయకుండా, తన బదులు మరొకరిని పరీక్ష రాసేందుకు పంపి నేరానికి పాల్పడింది.
  
 ఈ పరీక్ష రాయడానికి ఒప్పుకున్నా వ్యక్తికి ఆమె దాదాపు 300 డాలర్లు అంటే సుమారు రూ.25,000 పైగా ఇచ్చింది. గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసినా ఆమెకు పాస్ మార్కులు రాలేదు. దీంతో ఆమె ఈ విధంగా ప్లాన్ చేసింది.

పరీక్ష రోజు తనకు ఆరోగ్యం బాలేదని, అందుకే పరీక్ష కేంద్రం బయట ఉన్న ఒక వ్యక్తికి డబ్బులిచ్చి తన బదులు రాయమని అడిగినట్లు పోలీసులకు చెప్పింది. రిజల్ట్ షీట్‌లో తన ఫోటో బాలేదని అందుకే మార్చానని యూనివర్సిటీని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ యూనివర్సిటీ వారు అమెరికాలోని పరీక్షా సంస్థను సంప్రదించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

 సోమవారం జరిగిన విచారణలో జడ్జి ఈ విషయం పై కఠినంగా స్పందించారు. ఇలాంటి మోసాల వల్ల యూనివర్సిటీల సమయం వృధా అవుతోంది. నిజాయితీగా చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, ఇలాంటి పనులు చేసే వారికి తగిన బుద్ది  రావాలి అని అన్నారు. మొదట ఐదు నెలల జైలు శిక్ష విధించాలని అనుకున్నప్పటికీ, ఆమె చేసిన తప్పును ఒప్పుకున్నందుకు శిక్షని  మూడు నెలలకు తగ్గించారు.