కరీంనగర్ రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆమె కూడా చనిపోయింది !

కరీంనగర్ రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆమె కూడా చనిపోయింది !

కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి శిరీష పురుగుల మందు తాగింది. తల్లీ-పిల్లలను కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం శిరీష చనిపోయింది. కూతురు, కుమారుడికి హాస్పిటల్‌లో వైద్యం కొనసాగుతుంది.

కుటుంబ కలహాలతో శిరీష పురుగుల మందు తాగిందని తెలిసింది. ఆ తర్వాత చిన్నారులైన కూతురు హాసిని, కుమారుడు హర్శిత్కు పురుగుల మందు తాగించింది. మృతురాలి పుట్టింటి ఊరు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. ఐదేళ్ల క్రితం రేకుర్తి గ్రామానికి చెందిన కిషోర్‌తో వివాహం జరిగింది. ఇటీవల ఇంట్లో కలహాలు ఎక్కువ కావడంతో మానసిక ఆవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.