బిడ్డ చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేక.. ఓనర్ బిడ్డను ఎత్తుకెళ్లిన పనిమనిషి

బిడ్డ చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేక..  ఓనర్ బిడ్డను ఎత్తుకెళ్లిన పనిమనిషి

పుట్టిన బిడ్డ చనిపోయిందనే విషయం కుటుంబ సభ్యుల దగ్గర దాచిన  పనిమనిషి.. తన బిడ్డ  బతికే ఉందని నమ్మించేందుకు పనిచేస్తున్న అపార్టుమెంటులోనే మరొకరి బిడ్డను ఎత్తుకెళ్లింది పనిమనిషి.  మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన.  సంచలనం సృష్టించిన 8 నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. 

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల వేగవంతమైన దర్యాప్తుతో చిన్నారిని సురక్షితంగా రక్షించి 2026 ఆగస్టు 5న తల్లిదండ్రులకు అప్పగించారు. బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో నివాసముంటున్న కొత్త శివరామ్ దంపతుల ఎనిమిది నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్‌ను అదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నల్ల దుర్గా భవాని బుధవారం మధ్యాహ్నం ఎత్తుకెళ్లింది. 

చిన్నారిని కిందకు తీసుకెళ్తానని చెప్పి బయటకు తీసుకెళ్లిన ఆమె, అనంతరం ఆటోలో కర్మన్ ఘాట్ లోని తన ఇంటికి వెళ్లిపోయింది.శిశువు కనిపించకపోవడంతో తండ్రి కొత్త శివరామ్ వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బీఎన్‌ఎస్ సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం, ఆటో ప్రయాణ మార్గాన్ని గుర్తించడం,సాక్షులను విచారించడం, సమీప పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలో కేవలం మూడు గంటల్లోనే కర్మన్ఘాట్ ప్రాంతంలో చిన్నారిని గుర్తించి సురక్షితంగా రక్షించారు. 

పోలీసుల విచారణలో నిందితురాలు దుర్గా భవాని వ్యక్తిగత విషాదం వెలుగులోకి వచ్చింది. 2022లో వివాహం చేసుకున్న ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్‌లో జన్మించిన శిశువు రెండు రోజులకే మృతి చెందినట్లు గుర్తించారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టి, తమకు బిడ్డ ఉందని నమ్మించేందుకు ఒక చిన్నారిని అపహరించాలని ముందుగానే పథకం వేసి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మేడిపల్లి ఏసీపీ, ఉప్పల్ డీసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రత్యేక బృందాలను మల్కాజిగిరి డీసీపీ అభినందించారు.