పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దారుణం జరిగింది. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల ప్రకారం.. పెదకూరపాడు గ్రామంలోని స్థానిక ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో అవ్వారు బాల గురవయ్య - అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం (ఆగస్ట్ 5) మధ్యా్హ్నం బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు.
గురవయ్య దంపతులను ఆధార్ కార్డ్ అడిగారు. ఆందోళనకు గురైన గురవయ్య.. ఎవరూ మీరంటూ ప్రశ్నించారు. దీంతో తమతో తెచ్చుకున్న రాడ్డుతో గురవయ్య తలపై బలంగా కొట్టారు దుండగులు. ప్రతిఘటించిన గురవయ్య భార్య గొంతు కోసి పరార్ అయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ గురవయ్య దంపతులను పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
