బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై, ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2026 ఆగస్టు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు. బంగ్లాదేశ్ కు ఇండియా అత్యవసర సమయాల్లో అండగా ఉంటూ వచ్చిందని అన్నారు.
ఇదే సందర్భంలో ఆమె కుమారుడు, ఆమె వ్యక్తిగత సలహాదారు సజీబ్ వాజేద్ జాయ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఇప్పుడు మరో పాకిస్తాన్ లా మారిపోయిందని అన్నారు. అది ఇండియాకు ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం అని అన్నారు. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియా వ్యతిరేక శక్తులను, టెర్రరిస్టులను ఏరిపారేసినట్లు చెప్పారు.
మహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లా పూర్తిగా నాశనం అయ్యిందని.. ఆగస్టు 5, 2024 తర్వాత రాజకీయ హత్యలు అధికారికంగా జరుగుతున్నాయని ఆరోపించారు. హసీనా బహిష్కరణ తర్వాత పోలీస్ కస్టడీ మరణాల సంఖ్య పెరిగిపోయిందని అన్నారు.
2024 జులై ఆగస్టు నిరసనల సందర్భంగా 1400 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమతి నివేదికలో తేలిందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 800 మాత్రమేనని చెబుతున్నట్లు తెలిపారు. మిగతా 600 మంది ఎవరని ప్రశ్నించారు.
ఢిల్లీలోని సౌత్ ఆసియా క్లబ్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హసీనా.. కీలక విషయాలు పంచుకున్నారు. బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లనున్నట్లు ఈ సందర్భంగా హసీనా చెప్పారు. తనపై కేసులకు భయపడనని అన్నారు. తను వెళ్తే చంపేయాలని చూస్తున్నారని.. అయినా వెళ్తానని చెప్పారు.
తను తిరిగి వెళ్లాలనుకునేది అధికారం కోసం కాదని.. అక్కడి తిరిగి దేశ భద్రత, అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, శాంతిని నెలకొల్పేందుకేనని అన్నారు. వాళ్లు నన్ను జైల్లో వేసినా.. చంపేసినా ఏదైనా జరిగినా.. వెళ్లాల్సిందేనని అన్నారు. 2024 ఆగస్టులో ప్రభుత్వం మారిన తర్వాత భారత్ తో బంగ్లా సంబంధాలన్నీ చెడిపోయాయని.. దీనికి కారణం ప్రస్తుతం అక్కడ ఉన్న పాలకులేనని విమర్శించారు.
ఆర్థికంగా బంగ్లా క్షీణించిపోయిందని.. జీడీపీ మందగించిందని అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. పేదరికంతో అల్లాడుతున్నట్లు తెలిపారు.
తను దేశం నుంచి బహిష్కరించాక 2024 నుంచి వేల మందిని అరెస్టు చేశారని.. ఎంతో మంది అవామీ లీగ్ కార్యకర్తలు, లీడరర్లను, తమ మద్ధతు దారులను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు, జడ్జీలు, మైనారిటీలను ఘోరంగా హింసించారని అన్నారు. వారందరికీ భరోసా ఇచ్చేందుకు, దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకైనా తను వెళ్లాల్సి ఉందని అన్నారు.
