ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది.. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే కారుకూతలు కూయొద్దు: కవిత

ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది.. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే కారుకూతలు కూయొద్దు: కవిత
  •     ఎన్నికల్లో ఆ పార్టీ అట్టర్​ ఫ్లాప్​.. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకే పరిమితం
  •     నేను పార్టీ పెడ్తున్నా అనగానే బీఆర్​ఎస్​ వాళ్లు అహంకారంతో మాట్లాడిన్రు
  •     తోకపార్టీ సీపీఐకి ఇప్పుడు.. బీఆర్​ఎస్​ పార్టీనే తోకపార్టీగా మారిందని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రజలు గుడి కట్టారని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్.. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో మున్సిపల్​ మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. వారికి 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారని, కాంగ్రెస్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వచ్చిన స్థానాలతో పోల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పటిదానితో పోలిస్తే.. చాలా స్థానాలు కోల్పోయిందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్​ అట్టర్​ఫ్లాప్​ అయిందన్నారు. 

శనివారం ఆమె హైదరాబాద్​లోని జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్​కు ఓటేశారన్నారు. తాము రాజకీయపార్టీగా వస్తామని చెప్పగానే బీఆర్ఎస్​ వాళ్లు ట్రోల్​ చేయడం మొదలుపెట్టారన్నారు. వాళ్లకు ఒకటే చెబుతున్నా.. ‘ఇది కేవలం ట్రైలరే.. అసలు పిక్చర్​ బాకీ హై’ అని పేర్కొన్నారు. ఇప్పుడే కారుకూతలు కూయొద్దని హెచ్చరించారు. 

ఉద్యమకారులకు మంచి చేయాలని తాను మాట్లాడితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి అహంకారం తగ్గించుకోకుంటే.. ఇలాంటి ఫలితాలే వస్తాయని విమర్శించారు. సీపీఐ అడగకుండానే కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి కేటీఆర్​ ఓపెన్​ ఆఫర్​ ఇవ్వడం దిగజారిపోవడమేనన్నారు. గతంలో తోకపార్టీ అని విమర్శించిన పార్టీకే.. ఇప్పుడు బీఆర్ఎస్​ తోక పార్టీగా మారిందన్నారు. 

ఎన్నికల్లో మాలాంటోళ్లను ఆదరించారు 

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే కాంగ్రెస్​ ఎక్కువ సీట్లు గెలిస్తే.. రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని బీజేపీ కరీంనగర్​ కార్పొరేషన్​ తప్ప అన్నిచోట్లా అష్టకష్టాలూ పడిందని కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త అభ్యర్థులను ప్రజలు ఆదరించారని, త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పోటీ చేశామని తెలిపారు. 

సమయం తక్కువగా ఉన్నా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​తో కలిసి పోటీ చేశామన్నారు. వడ్డేపల్లిలోనూ తాము క్లియర్​గా గెలిచినా.. కాంగ్రెస్​ వాళ్లు ప్రలోభపెట్టి వాళ్లను లాక్కునే ప్రయత్నాలు చేశారన్నారు. నారాయణపేటలోనూ వైస్​చైర్మన్​ పదవిని ఆఫర్​ చేస్తున్నారని తెలిపారు. నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలేశామన్నారు.   

ప్రభుత్వ పైసలు పెట్టి ప్రచారం

గ్రామ పంచాయతీ, మున్సిపల్​ఎన్నికల్లో చట్టాలు, పరిమితులను సీఎం పూర్తిగా ఉల్లంఘించారని కవిత ఆరోపించారు. గ్రామాల్లో ప్రభుత్వ ధనంతో ప్రచారం నిర్వహించారని.. అయినా కూడా ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘సీఎం రేవంత్​.. నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నారు. దానికి ఆరు నెలలు బోనస్​గా కలిసి వస్తుందని చెబుతున్నారు. ముందు ఆయన రైతులకు బోనస్​ ఇవ్వాలి. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్​, జాగృతి కలిసి పనిచేస్తాయని”అని కవిత అన్నారు.