భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరాఠాలు శక్తిమంతులయ్యారు. మరోవైపు బ్రిటిష్ వారు భారత్‌ను తమ అధీనంలోకి తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఒకవైపు ఈ మూడు శక్తుల పోరాటం నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడానికి సేవాలాల్ మహారాజ్ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తియుగంలో జన్మించిన మహాత్ములలాగా భక్తిని ప్రేరేపించారు. భక్తి ఆయుధంగా సంస్కరణ చేశారు. సమాజాన్ని సంఘటితం చేసి రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టారు.
బంజారాలకి ఉన్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగ కూడా ఇదే. అయినా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా, రొమేనియా, ఉక్రెయిన్, వంటి చాలా యూరోపియన్ దేశాలలోని రోమాజిప్సీ బంజారాల తెగవారు తాము భారత దేశం నుంచి వచ్చామని చెప్పుకుంటారు. ఆ రకంగా బంజారాలు పర దేశాల్లో కూడా జీవిస్తున్నారు. బంజారాలు తండాల్లో జీవిస్తారు.
బంజారాల బతుకంతా నిత్యపోరాటమే వారు ప్రకృతితో, పరిసరాలతో పోరాడాలి నిత్య సంచారం వల్ల స్థానిక ప్రభుత్వాలతో పోరాడాలి ఇది వారి బతుకు, కష్ట జీవులైన బంజారాలు తమ కుటుంబంతో ఊరూరా తిరుగుతు సరుకులు సరఫరా చేసేవారు. మధ్యకాలాల్లోని పృధ్వీరాజ్ చౌహాన్ సంతతి వారమని చెప్పుకునే బంజారాలు రాజస్థాన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఒకనాటి అఖండ భారతఖండంలోని అఫ్ఘానిస్తాన్ గోర్ ప్రావిన్స్ ప్రాంతం నుండి మన దేశానికి వచ్చారని చరిత్రకారుల భావన.
1741లో తెలుగు నేల మీద జన్మించిన సంత్ సేవాలాల్ గురించి తెలుసుకోవడం అవసరం. బంజారాలు మొదటి నుండి వీరయోధులు బానిసత్వాన్ని వ్యతిరేకించడం వీరి నైజం. సంత్ గురు గోబింద్‌సింగ్‌తో ఉత్తర భారత దేశం నుండి వచ్చిన బంజారాలు కొంతమంది నాందేడ్ నుండి కన్నడ ప్రాంతానికి తరలివెళ్లారు. ఆనాడు కర్నాటక రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో ఉన్న గుత్తికి దగ్గర గల ప్రాంతంలో అలా తరలివచ్చిన వారి కుటుంబంలో సేవాలాల్ పుట్టాడు. అక్కడే సంత్ సేవాలాల్ పాత గుడి ఒకటి ఉంది. అతను బాల బ్రహ్మచారి బంజారా సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలని భావించాడు.
తాము ఇక్కడకు వచ్చినప్పటి నుండి ఆంగ్లేయులు తమని కష్టాలకు గురిచేస్తున్న విషయం గమనించాడు. వారు తమ కోసం వేసుకుంటున్న రైలు, రోడ్లు తమ రాకపోకలకు అంతరాయం కల్పించడం గమనించారు. పన్నులు వసూలు చేయడం కోసం కాంచీటీలు (డబ్బు రసీదు కేంద్రాలు) ఏర్పాటు చేయడం వారికి ఏమాత్రం రుచించలేదు. తమ వృత్తి మీద దెబ్బ కొట్టడానికే అలా చేస్తున్నారని భావించి వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన బంజారాలను జైళ్లలో పెట్టడం, శిక్షల పేరుతో ఉరి తీయడం వారిని కలచివేసింది.
అలా బ్రిటిష్ వారిని ఎదురొడ్డి నిలిచిన బంజారాలను 1871లో వీరిని ‘నేరస్థ జాతి’గా పరిగణించడం బాధకు గురి చేసి తమ సంప్రదాయ వ్యాపారం దెబ్బ తినడం వల్ల గోవులను మేపుకుని బతకడమే బతుకుతెరువైంది. సేవాలాల్ ముందు గా బంజారా సమాజాన్ని సంస్కరించాలని అనుకున్నాడు. తన పూర్వీకులు వచ్చిన దారిలోనే నాందేడ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఒరిస్సా, మద్య ప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లి సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం బోధనలు చేసి అనేక ఉద్యమాలు చేశారు.
హింస మహా పాపమని హితవు
వీరిలో ‘పెరిఫర్’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి. హింస మహా పాపమని హితవు పలికాడు. ఒకప్పుడు హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన నిజాం రాజు సేవాలాల్ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలించాడని చరిత్ర తెలుపుతోంది. తిరుపతిలోని హాథీరాం బాలాజీ (1832-–1928) వంటివారికి గురుతుల్యునిగా వున్న సేవాలాల్ బంజారా సమాజానికి తొలి ఆధునిక వేగుచుక్క. మారుతున్న కాలాన్ని బట్టి బంజారాలు ఆధునిక సమాజ పౌరులుగా తీర్చిదిద్దడానికి అతని సంచార జీవితమే ప్రధాన అనుభవ భూమిక అయింది.
- జటావత్ హనుము
