బ్రెసిలియా: బ్రెజిల్ దేశంలో సినీ రేంజ్లో విమాన ప్రమాదం జరిగింది. రియో డి జెనీరో నగరంలో ఆదివారం (జూన్ 14) ఉదయం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. నగర పశ్చిమ భాగంలోని జనసాంద్రత అధికంగా ఉన్న రెక్రియో డోస్ బాండిరాంటెస్ అనే శివారు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రియో డి జెనీరో సైనిక అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొని రియో డి జెనీరో నగర పశ్చిమ భాగంలో కూలిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లలో ఒకటి ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌పై కుప్పకూలింది. దీంతో భారీగా చెలరేగిన మంటలు ఆ ప్రాంతమంతా వేగంగా వ్యాపించాయి. దాదాపు 20 కార్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
►ALSO READ | చివరి దశలో మళ్లీ పెంట పెట్టకుర్రి: ఇజ్రాయెల్‌పై ట్రంప్ సీరియస్
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. హెలికాప్టర్లు గాల్లో ఎలా ఢీకొన్నాయనే దానిపై వివిధ కోణాల్లో ఆరా చేస్తున్నారు. ఏటీసీ మిస్ కమ్యూనికేషన్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు
