ధాయ్ లాండ్.. ఒక్కసారి అయినా వెళ్లి ఎంజాయ్ చేయాలని కలలు కంటారు.. థాయ్ లాండ్ లోని పట్టాయ అంటే కుర్రకారుకు ఎక్కడ లేని హుషార్ తీసుకొస్తుంది. పట్టాయలో ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయకపోతే థాయ్ లాండ్ టూర్ కంప్లీట్ కాదు అనే భావన అందరిలో ఉంది.. ఇలాంటి పట్టాయకు వెళ్లిన భారత పర్యాటకులు.. అక్కడి వాళ్లు చెప్పిన చౌక అయిన ప్యాకేజీ ఎరలో పడి.. కిడ్నాప్ అయ్యారు. ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి 70 లక్షల రూపాయల క్రైం డ్రామా నడిపారు. భారత్, థాయ్ లాండ్ దేశాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
థాయ్‌లాండ్‌లో చౌక టూర్ ప్యాకేజీ పేరుతో వెళ్లిన ముగ్గురు భారతీయులు కిడ్నాపర్ల చేతిలో చిక్కి వారం రోజుల పాటు చిత్రహింసలు అనుభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టాయలోని ఓ ఇంట్లో వారిని బంధించిన కిడ్నాపర్లు, కుటుంబ సభ్యుల నుంచి రూ.70 లక్షలు డిమాండ్ చేసినట్లు థాయ్ పోలీసుల విచారణలో వెల్లడైంది.
బాధితులు ఒక్కొక్కరు సుమారు రూ.2 లక్షలు చెల్లించి టూర్ ప్యాకేజీ తీసుకున్నారు. పట్టాయకు చేరుకున్న తర్వాత వారిని ఓ అద్దె ఇంటికి తీసుకెళ్లి ముగ్గురు భారతీయులు, మరో ఇద్దరు పాకిస్తానీయులతో కూడిన ముఠా టూరిస్టులను కిడ్నాప్ చేసింది. ప్రతిరోజూ వారిని కొట్టి, తలకిందులుగా వేలాడదీసి, ఆహారం కూడా సరిగా ఇవ్వకుండా హింసించారని తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేయించి డబ్బు పంపాలని బెదిరించినట్లు తేలింది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసేందుకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు కనిపించేలా బాధితుల శరీరాలపై ఎరుపు రంగు పూసినట్లు పోలీసులు గుర్తించారు.
►ALSO READ | టెలిగ్రామ్ సీఈవోపై రష్యా మోస్ట్ వాంటెడ్ నోటీస్ : ఫ్రాన్స్ అప్పగిస్తుందా లేదా..?
భారతదేశంలోని బాధితుల కుటుంబ సభ్యులు థాయ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 27న పట్టాయలోని ఇంటిపై దాడి చేసి ముగ్గురు బాధితులను సురక్షితంగా రక్షించారు.
ఈ కేసులో అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రాంబలక్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్, కుల్రా సింగ్ అనే ఐదుగురు భారతీయులను బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఈ కుట్ర వెనుక దుబాయ్‌లో ఉన్న వ్యక్తి, పాకిస్తానీ నిందితుల పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. డిమాండ్ డబ్బును క్రిప్టోకరెన్సీ ద్వారా స్వీకరించాలని ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
చౌక టూర్ ప్యాకేజీల పేరుతో విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని థాయ్ పోలీసులు హెచ్చరించారు. విదేశీ ప్రయాణాలకు ముందు టూర్ నిర్వాహకుల విశ్వసనీయతను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.
