పావలా శ్యామలా అంత్యక్రియల సమయంలో ఆమె కూతురు మాధవి భావోద్వేగానికి లోనైంది. సీనియర్ నటుడు నరేష్ను చూసి.. తనకు అమ్మ తప్ప ఎవరూ లేరని, తనను కూడా అమ్మతో పాటే తగలబెట్టేయండని పావలా శ్యామలా కూతురు మాధవి ఏడుస్తూ మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. పావలా శ్యామల కూతురిని నరేష్, కరాటే కల్యాణి ధైర్యం చెప్పారు. నీకు మేమంతా ఉన్నామని ఆమెలో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు.
పావలా శ్యామల కూతురు కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమెది కూడా వీల్ ఛైర్ నుంచి కదల్లేని పరిస్థితి. మహా ప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు జరిగాయి. పావలా శ్యామలకు కూతురు తప్ప ఎవరూ లేరు. అయిన వాళ్లంతా ఆమెను ఆదరించలేదు. దీంతో.. ‘మా అసోషియేషన్’ ఆధ్వర్యంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. మురళీమోహన్, రాజీవ్ కనకాల, కరాటే కళ్యాణి, గిరిబాబు, హేమ పలువురు సినీ ప్రముఖులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి పావలా శ్యామల(75) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు.
వృద్ధాప్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పావలా శ్యామలకు గతంలో సినీ నటులు పవన్ కల్యాణ్, సాయి దుర్గ తేజ్, నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. ఆమె భౌతికకాయాన్ని వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఫౌండేషన్‌కు తరలించారు. నటి కరాటే కళ్యాణి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ప్రధాన కార్యదర్శి రఘుబాబు తదితరులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.
1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన పావలా శ్యామలా అసలు పేరు నేతి శ్యామల. 1985లో విడుదలైన ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గణేశ్ పాత్రో రచించిన ‘పావలా’ నాటకంలో నటించి విశేష ఆదరణ పొందడంతో అప్పటి నుంచి ఆమె పావలా శ్యామలగా గుర్తింపు పొందారు.
