శ్రీశైలం, వెలుగు: ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానాకాలం మొదలై రెండు నెలలైనా ఇప్పటివరకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో రాలేదు. మంగళవారం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి వరద నీరు చేరింది. ఎగువ నుంచి జూరాలకు 18 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, దిగువన ఉన్న శ్రీశైలానికి 29,233 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 820.60 అడుగుల వద్ద నీరు ఉంది. 215.8070 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 41.2794 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటి విడుదల..
మక్తల్ : కృష్ణా నదికి ఎగువ నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి భీమా ఫేస్-1, ఫేస్-2 పరిధిలో రెండు మోటార్లను ప్రారంభించి 1,300 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తున్నారు. ఇందులో సంగంబండ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కులు, భూత్పూర్ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పంపింగ్ ప్రక్రియను ఇరిగేషన్ ఇంజినీర్లు జస్వంత్, అక్షయ్, సిబ్బంది పర్యవేక్షించారు.
జూరాలకు 18 వేల క్యూసెక్కుల వరద
గద్వాల : జూరాల ప్రాజెక్టుకు కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 18 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 318.00 మీటర్ల లెవెల్ నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 30వేలు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, బీమా లిఫ్టు -1కి 1300, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 32,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
