హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు

హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు
  • రసూల్ పురాలో త్వరలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు
  • సంజీవయ్య పార్క్ నుంచి బేగంపేట్ వెళ్లే రూట్లో ఆర్‌‌‌‌ఓబీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు నిర్మిస్తున్న రెండు కీలక ప్రాజెక్టులు వచ్చేనెలలో పూర్తయి అందుబాటులోకి రానున్నాయి. అలాగే, మరో రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ నుంచి సంతోష్‌‌‌‌నగర్‌‌‌‌ ఫ్లైఓవర్‌‌‌‌ పనులు చివరి దశకు చేరుకోగా, ఆగస్టులోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది.

మొత్తం రూ. 672 కోట్లు  
రూ.52 కోట్ల ఖర్చు పెట్టి 6 లేన్లతో 220 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ముసారాంబాగ్​ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అంబర్‌‌‌‌పేట్– మలక్‌‌‌‌పేట్ మధ్య రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. అలాగే, చంచల్‌‌‌‌గూడ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌‌‌‌నగర్ వరకు నిర్మిస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి కోసం పాతబస్తీ ప్రజలు ఆరేండ్లుగా ఎదురుచూస్తున్నారు. ర్యాంపులు, సైడ్ వాల్స్, లైటింగ్ వంటి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. రూ.620 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జి 3.32 కిలోమీటర్ల పొడవు,85 పిల్లర్లతో నిర్మించారు. బ్రిడ్జి పూర్తయితే సైదాబాద్, సంతోష్‌‌‌‌నగర్, చంచల్‌‌‌‌గూడ, ఐఎస్ సదన్, చంపాపేట్ ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరతాయి.

కొత్త ప్రాజెక్టులు ఇవే..
సిటీలో కొత్తగా మరో రెండు ప్రాజెక్టులు కూడా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. రూ.152 కోట్లతో నెక్లెస్ రోడ్(సంజీవయ్య పార్కు) నుంచి బేగంపేట్ వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌‌‌‌ఓబీ) నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే ట్యాంక్ బండ్ మీదుగా  బేగంపేట్ వెళ్లేవారి జర్నీ ఈజీ కానుంది. అలాగే రసూల్‌‌‌‌పురాలో  రూ. 48.14 కోట్ల అంచనాతో నాలుగు లేన్ల బయో డైవర్షనల్ ఫ్లైఓవర్ ను కూడా జీహెచ్ఎంసీ నిర్మించనున్నది. దీని టెండర్లు కూడా పూర్తి కాగా, త్వరలోనే పనులు షురూ కానున్నాయి.