- పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ
- www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్లు
- త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం: బోర్డ్ చైర్మన్ శ్రీనివాస రావు
హైదరాబాద్, వెలుగు: పోలీస్‌శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్‌లో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు కానిస్టేబుల్, డ్రైవర్, మెకానిక్ పోస్టులు సహా జైళ్లు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ పోస్టుల వివరాలతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) బుధవారం డిటైల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేడర్ వారీగా పోస్టులు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను అందులో పొందుపరిచింది.
ఈ మేరకు బోర్డ్ చైర్మన్ శ్రీనివాస రావు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. www.tgprb.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తామని, అప్లికేషన్లు సమర్పించాల్సిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
సివిల్ సర్జన్ ద్వారా నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు పాటించాలి
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను సరిచూసుకున్న తర్వాత, ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ప్రొఫార్మా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ్ చైర్మన్ శ్రీనివాస రావు సూచించారు. పరీక్షకు దరఖాస్తు చేసే ముందు శారీరక, వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి సివిల్ సర్జన్ ద్వారా పరీక్షించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ల సమయంలో, ఆ తర్వాత అప్‌లోడ్ చేయడానికి అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
