కల్తీ పన్నీర్ దందా.. నారాపల్లిలో 600 కేజీల పన్నీర్ సీజ్..

కల్తీ పన్నీర్ దందా.. నారాపల్లిలో 600 కేజీల పన్నీర్ సీజ్..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అభం శుభం తెలియని సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కాలం చెల్లిన ఆహార పదార్ధాలను అమ్ముతున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు. లేటెస్ట్ గా  మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భారీగా కల్తీ పనీర్ గుట్టు రట్టయింది.

ఉప్పల్ ఎస్ఓటి (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో ఈ భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో ఎటువంటి తయారీ తేదీ లేని, కాలం చెల్లిన  పనీర్‌ను పోలీసులుసీజ్ చేశారు.

ఈ దాడుల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ప్రజల ఆరోగ్యాన్ని హరించేలా నిల్వ ఉంచిన దాదాపు 600 కిలోల పనీర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం పనీర్ మాత్రమే కాకుండా, ఈ అక్రమ రవాణాకు , వ్యాపారానికి ఉపయోగిస్తున్న 2 ఆటోలు, 2 సెల్ ఫోన్లు,  2 వెయింగ్ మిషన్లను కూడా అధికారులు సీజ్ చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఉప్పల్ ఎస్.ఓ.టి పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు ఈ కల్తీ పనీర్ ఎక్కడి నుంచి వస్తోంది? వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

ALSO READ : విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానే

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.