విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానే: రాహుల్ గాంధీ

విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జులై 29) యాంటి పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యా్స్ ప్రయోగం, పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానేనని సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా భయంతో వణికిపోతున్నారని.. అందుకే ఆయన సభకు కూడా రావడం లేదని అన్నారు. పోలీసుల చర్యలపై యువతకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాహుల్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అధికార పక్ష ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. రాహుల్ గాంధీవి పూర్తిగా తప్పుడు, నిరాధార ఆరోపణలు అని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులపై కాల్పులకు అమిత్ షానే ఆదేశాలు ఇచ్చారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని రిజిజు స్పీకర్‎ను కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అలా ఎలా మాట్లాడుతారంటూ రాహుల్‎పై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రిజిజు డిమాండ్ చేశారు. 
 
యాంటి పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆవేదనతోనే విద్యార్థులు రోడ్డెక్కారు. బీజేపీ ఎంపీల పిల్లలను అడిగినా విద్యార్థుల ఆ బాధేంటో తెలుస్తోంది. విద్యార్థులు ఓపెన్‎గా తమ అభిప్రాయాలు చెప్పారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నరు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. అన్ని పార్టీలు విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి. కొంతమందికి ఇడియట్స్‏కు మా బాధ అర్ధం కావడం లేదని విద్యార్థులు నాతో చెప్పారు. విద్యార్థుల ఆందోళనను బీజేపీ నేతల పిల్లలు సమర్ధించారు. విద్యార్థుల ఆందోళనలపై ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలయ్యాడు’’ అని అన్నారు.