ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. మేడారంలోని జంపన్న వాగు ఉధృతికి హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి గల్లంతయ్యాడు.
ములుగు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మేడారంలోని ప్రసిద్ధ జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఊరట్టం వద్ద ఉన్న జంపన్న వాగు లో-లెవెల్ బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో.. మేడారం బ్రిడ్జి పైకి పూర్తిగా నీరు చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. దీంతో మేడారం గ్రామం నుంచి హరిత హోటల్ వరకు ప్రధాన రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌లోని ఘట్కేసర్ నుంచి మేడారానికి దర్శనం కోసం వచ్చిన ఆరుగురి బృందంలో తిమ్మయ్య' అనే వ్యక్తి జంపన్న వాగు ఉధృతిలో చిక్కుకుని గల్లంతు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన తిమ్మయ్య కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కొత్తూరు నుంచి రెడ్డిగూడెం వెళ్లే లో-లెవెల్ వంతెన పైనుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండగా.. నార్లాపూర్ నుంచి కొత్తూరు వెళ్లే దారిలోనూ జంపన్న వాగు ఉధృతికి వంతెనలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
