వరంగల్ : పార్టీ మారుతుందనే ఊహాగానాలను తోసిపుచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. తాము కాంగ్రెస్ లోనే పుట్టాం.. కాంగ్రెస్ లోనే ఉంటామని అన్నారు. 2026 సెప్టెంబర్ 13న వరంగల్ లోని ఎంకే నాయుడు హాల్ లో వరంగల్ తూర్పు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కొండా దంపతులు. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ.. వరంగల్ తూర్పు టికెట్ తనదేనని.. మళ్లీ గెలిచి మంత్రినవుతానని ధీమా వ్యక్తం చేశారు.
పదవి అలంకారం మాత్రమేనని చెప్పిన కొండా సురేఖ.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయినందుకు బాధలేదని.. కానీ అకారణంగా తొలగించడమే తనను బాధించిందని కార్యకర్తల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఫోన్లు వచ్చాయని.. ఎటూ వెళ్లవద్దని అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే గెలిచాను.. మళ్లీ కాంగ్రెస్ నుంచే పోటీచేసి గెలుస్తానని ఈ సందర్భంగా చెప్పారు.
తనను బర్తరఫ్ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదని.. కొండా మురళీకి పదవి ఇస్తామన్న సంకేతాలు వచ్చాయని అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో మొట్టమొదటిసారిగా మాట్లాడింది తానేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవి వచ్చిందని.. తనకు ఇచ్చిన మూడు శాఖల్లో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
ప్రజల మధ్యే ఉంటాము, ప్రజలకు సేవచేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 25డివిజన్ లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీవీ కథనాలు ఊహాత్మక కథనాలన్నీ అబద్దమేనని ఈ సందర్భంగా అన్నారు. తాము ఏ పార్టీలోకి వెళ్లబోమని.. కాంగ్రెస్ లో పుట్టాము, కాంగ్రెస్ లోనే ఉంటామని చెప్పారు. గతంలో కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఈ పార్టీలో గెలిచి ఆ ఆపార్టీలో చేరే అనైతిక రాజకీయాలు చేయలేదని చెప్పారు.
సోకాల్డ్ నేతలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై పరోక్షంగా విరుచుకుపడ్డ కొండా సురేఖ. కార్పోరేటర్ గా కూడా గెలువలేని సారయ్య తనను రాజీనామా చేయమంటున్నాడని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
తనను బర్తరఫ్ చేసిన రోజు అల్లర్లు చేయాలా అని అభిమానులు అడిగారని.. కానీ తాము వద్దన్నట్లు గుర్తు చేశారు. తమ ఆదేశాలు పాటించిన అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. పదవులు వస్తాయి, పోతాయి.. తమకు అండగా ఉన్న కార్యకర్తలకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా చెప్పారు.
గతంలో ఓ నాయకుడిని నమ్ముకుంటే అండగా ఉండే వారు కానీ ఇప్పుడు రాజకీయాల్లో అలాంటి పరిస్థితి లేదన్నారు. నమ్ముకున్న వైఎస్ కోసం తను మంత్రిపదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జిల్లా గుంటనక్కలు వెంటబడ్డాయని విమర్శించారు. అప్పటి మంత్రి బస్వరాజు సారయ్యను ఓడించేందుకు కేసిఆర్ తమకు వరంగల్ టికెట్ ఇచ్చారని స్పష్టం చేశారు. సారయ్య కుటుంబం ఇంకా భూకబ్జాలు, వసూళ్లకు పాల్పడుతోందని అన్నారు. పరకాల విడిచిపెట్టగానే పరకాలలో బీఆర్ఎస్ నేత ధర్మారెడ్డి పాగా వేసి కోట్లాది రూపాయలు సంపాదించి... నాయకులను కొన్నాడని ఆరోపించారు.
