హెల్మెట్‌, షూస్‌కు కూడా స్నానం అవసరం.. లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తయ్.. అందుకే ఈ ‘శానిటరీ బాత్‌’.. జస్ట్ రూ.100 ఇస్తే..

హెల్మెట్‌, షూస్‌కు కూడా స్నానం అవసరం.. లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తయ్.. అందుకే ఈ ‘శానిటరీ బాత్‌’.. జస్ట్ రూ.100 ఇస్తే..

హెల్మెట్‌‌.. బైక్‌‌ నడిపినప్పుడల్లా తలపై పెట్టుకుంటాం. షూస్‌‌.. బయటకు వెళ్లినప్పుడల్లా వేసుకుంటాం. కానీ వాటిని చివరిసారిగా ఎప్పుడు శుభ్రం చేశామో మాత్రం గుర్తుండదు! చెమట, దుమ్ము, తేమతో వాటిలో పేరుకుపోయే సూక్ష్మజీవులకు ఇప్పుడు ‘శానిటరీ బాత్‌‌’ సిద్ధమైంది. ఏటీఎంలా కనిపించే ఆటోమేటిక్‌‌ యంత్రంలో హెల్మెట్‌‌, షూస్‌‌ను పెట్టి రూ.100 చెల్లిస్తే.. యూవీ, ఓజోన్‌‌, ఆవిరి, వెచ్చని గాలి సాంకేతికతలతో శుభ్రం చేసి ఇస్తున్నారు.

చెమట, తేమ వల్ల హెల్మెట్‌‌ లైనర్‌‌లో ఫంగస్‌‌, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఒకరి హెల్మెట్‌‌ను మరొకరు ఉపయోగిస్తే చర్మ సంబంధ ఇన్‌‌ఫెక్షన్లు వ్యాపించవచ్చని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అందుకే హెల్మెట్‌‌ పరిశుభ్రతకు స్మార్ట్‌‌ హెల్మెట్‌‌, షూ డిస్‌‌ఇన్‌‌ఫెక్షన్‌‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ‘స్టెప్‌‌ట్రాన్‌‌’ షూ క్రిమిసంహారక కియోస్క్‌‌లు స్టెరిలైజేషన్‌‌, డిస్‌‌ఇన్‌‌ఫెక్షన్‌‌, డియోడరైజేషన్‌‌, 360 డిగ్రీల వెచ్చని గాలితో ఆరబెట్టడం వంటి నాలుగు దశల్లో పనిచేస్తాయి.

హైదరాబాద్‌‌లోని డీఎస్‌‌ఎల్‌‌, ఏఎంఆర్‌‌ షాపింగ్‌‌ మాల్స్‌‌తోపాటు హిందుస్థాన్‌‌ పెట్రోలియం, ఇండియన్‌‌ ఆయిల్‌‌, భారత్‌‌ పెట్రోలియం పెట్రోల్‌‌ బంకుల్లో ‘గ్లోమీ స్మార్ట్‌‌’ కియోస్క్‌‌లు ఏర్పాటుచేశారు. ఇప్పటికే సిటీలో 25కు పైగా కియోస్క్‌‌లు అందుబాటులోకి వచ్చాయి. చైనా, తైవాన్‌‌, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్‌‌ పరికరాల విడిభాగాలను హైదరాబాద్‌‌కు చెందిన గ్లోమీ స్మార్ట్‌‌ కంపెనీ అసెంబ్లింగ్‌‌ చేసి వీటిని ఏర్పాటు చేసింది.

ఈ కియోస్క్‌‌లను మహబూబ్‌‌నగర్‌‌, వికారాబాద్‌‌, తాండూర్‌‌, విశాఖపట్నంలోనూ ఏర్పాటు చేయనున్నట్లు గ్లోమీ స్మార్ట్‌‌ కంపెనీ అసోసియేట్‌‌ వినూత తెలిపారు. హెల్మెట్‌‌, షూస్‌‌ను ఫ్రెష్‌‌నెస్‌‌ లిక్విడ్‌‌తో శుభ్రం చేస్తున్నాం అన్నారామె.

హెల్మెట్‌‌ పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కియోస్క్‌‌లను ఉపయోగించుకోవాలని జూబ్లీహిల్స్‌‌ ట్రాఫిక్‌‌ ఏసీపీ కట్టా హరిప్రసాద్‌‌ సూచించారు. అయితే టెక్నాలజీతో క్లీనింగ్​తోపాటు హెల్మెట్‌‌ లైనర్‌‌, షూస్‌‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టడం కూడా అంతే ముఖ్యం.