పరిష్కారం.. పదవి వరించాలంటే.. పరీక్షలో ఎలా నెగ్గాలో తెలుసా..!

పరిష్కారం.. పదవి వరించాలంటే.. పరీక్షలో ఎలా నెగ్గాలో తెలుసా..!

పల్లవ రాజ్యాన్ని జయంతుడు పాలించేవాడు. ప్రస్తుతం ఉన్న మంత్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన స్థానంలో కొత్త మంత్రిని నియమించాలని చాటింపు వేయించాడు. సుమారు పాతిక మంది పోటీలో పాల్గొన్నారు.  చివరకు విజయుడు, ప్రభాకరుడు, కేశవుడు అనే వారు మిగిలారు. వారితో “మీకు చివరగా ఒక పరీక్ష పెడుతున్నాను. 

కృష్ణాపురం, రామాపురం, సీతాపురం గ్రామాలలో కొన్ని సమస్యలున్నాయి.. మీరు ఆ గ్రామాలలో తిరిగి సమస్యల నివారణ ఎలాగో తెలపాలి.. మీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను” అని చెప్పాడు రాజు.
“అలాగే మహారాజా!” అని ఆ ముగ్గురూ ఆ గ్రామాలకు చేరుకున్నారు. వారిలో ప్రభాకరుడు, కేశవుడు ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుని రెండు రోజులకే కోటకు చేరుకున్నారు. 

“మహారాజా! కృష్ణాపురంలో అంటువ్యాధులు, రామాపురంలో నీటి కొరత, సీతాపురంలో ఆహార కొరత ఉన్నాయి. అంటువ్యాధుల నివారణకు మెరుగైన వైద్యం అందించాలి. నీటి కొరతకు కొత్త బావులు తవ్వించాలి. ఆహార కొరత తీర్చడానికి ధాన్యం అందించాలి అని ప్రభాకరుడు, కేశవుడు ఒకే విధమైన సూచనలు చేశారు.

మూడు రోజుల తరవాత విజయుడు కోటకు వచ్చి రాజు గారిని కలిశాడు. “మహారాజా! కృష్ణాపురంలో అంటు వ్యాధులకు కారణం వీధుల్లో శుభ్రత లేకపోవడంతోపాటు ఇళ్ల ముందు మురికి నీరు నిలవడం కారణాలు. వీధులను శుభ్రంగా ఉంచి మురికి నీరు పోవడానికి కాలువలు తవ్వించాలి. వ్యాధిన పడినవారికి వెంటనే వైద్యం అందించి ప్రతి ఇంటి బయట ఎండిన వేప ఆకుల పొడిని జల్లితే అంటు వ్యాధులు శోకవు. 

రామాపురంలో సుమారుగా ఐదు మంచి నీటి చెరువులు ఉన్నాయి వాటిలో పూడిక తీయించాలి.. వచ్చేది వర్షాకాలం కాబట్టి నీటి సమస్య తీరవచ్చు. 

అలాగే సీతాపురంలో గత ఏడాది విత్తనాల కొరత వల్ల వ్యవసాయం సరిగ్గా సాగలేదు. అందువల్ల ఆహార ధాన్యం కొరత ఏర్పడింది. కోట నుండి ప్రతి ఇంటికి ఆహార ధాన్యం అందించి. వర్షాలు కురిశాక వ్యవసాయం కోసం రైతులకు మంచి రకం విత్తనాలు అందిస్తే సమస్య తీరిపోతుంది” అని చక్కని సూచనలు చేశాడు విజయుడు. 

 “కొట్టె, కట్టె, తెచ్చె అన్న విధంగా ప్రభకరుడూ, కేశవుడూ గ్రామాల విషయంలో ప్రవర్తించారు. విజయుడు పూర్తిగా మూడు రోజుల సమయం వినియోగించుకుని, ఆ మూడు గ్రామాలలో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా నివారణ ఎలాగో చక్కగా సూచించాడు.. అందువల్ల మంత్రి పదవి విజయుడినే వరించింది” అని అన్నాడు రాజు. మంత్రి పదవి దక్కినందుకు విజయుడు మహారాజుకు కృతజ్ఞతలు చెప్పాడు. 

- యు. విజయశేఖర రెడ్డి                 

గమనిక: మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.