హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 368 కోట్లతో భారీ ఫ్లైఓవర్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 368 కోట్లతో  భారీ ఫ్లైఓవర్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు   సీఎం రేవంత్  ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్లలో నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రూ. 368 కోట్లతో పరిపాలనా అనుమతులు

హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న హెచ్-సిటీ (H-City) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. నాగార్జున సర్కిల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు,అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం తాజాగా రూ. 368 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీఓ 736ను జారీ చేసింది.

గతంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 210 కోట్లుగా ఉండగా.. తాజాగా అది రూ. 368 కోట్లకు పెరిగింది. అదనంగా మరో రూ. 158 కోట్ల వ్యయం భార పడటంతో.. ప్రస్తుతానికి విప్రో జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది.ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో రూ. 147 కోట్ల వ్యయంతో రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 3 నుంచి జీవీకే మాల్ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఈ ప్రత్యేక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నారు.

►ALSO READ | తెలంగాణలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ..7వేల437 పోస్టులకు నోటిఫికేషన్

టీవీ9 జంక్షన్‌లో రూ. 221 కోట్ల వ్యయంతో భారీ ఎత్తున స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మించనున్నారు. ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వరకు మూడు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ రానుంది. అలాగే ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు రెండు లేన్ల అండర్‌పాస్ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకొని కాంక్రీట్ ఫ్లైఓవర్ స్థానంలో అత్యాధునిక స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లైఓవర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈపీసీ (EPC) విధానంలో టెండర్లు పిలిచి త్వరగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వాధికారులు ఆదేశించారు. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ (విద్యుత్, నీటి పైపుల మార్పిడి) పనులతో పాటు ప్రధాన నిర్మాణ పనులను సమాంతరంగా నిర్వహించి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.