పద్మారావునగర్, వెలుగు: 2017 నాటి నోట్ల రద్దు మోసం కేసులో సికింద్రాబాద్‌లోని XI అదనపు మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు 11 మందిని దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుడు అంతతాలి యాదగిరికి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4.5 కోట్ల జరిమానా విధించింది.
మరో 10 మందికి రూ.60 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడిన ముఠా నుంచి అప్పట్లో పోలీసులు రూ.1.20 కోట్ల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుని 17 మందిపై కేసు నమోదు చేశారు. బేగంపేట పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయడంతోనే నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని న్యాయస్థానం పేర్కొంది.
