- సమయానికి నిధుల విడుదలతో దరఖాస్తుల వెల్లువ
- ఇప్పటికేఇండ్ల కోసం 77.68 లక్షల అప్లికేషన్లు
- వడపోతలో సొంత స్థలం ఉండి ఇండ్లు లేని 23.20
- లక్షల మందిని ఎల్-1 కింద గుర్తించిన సర్కారు
- దశల వారీగా ఇండ్ల మంజూరు
- తొలి విడతలో 3.50 లక్షలు.. రెండో విడతలో 2.50 లక్షలు
- స్థలం లేనోళ్లకు ప్రభుత్వ జాగాల్లోనే లక్ష ఇండ్లు కట్టించే ప్లాన్
- ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం
- రూ.6,500 కోట్లకుపైగా వెచ్చించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల నిజం చేసే ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి ప్రజలనుంచి డిమాండ్ పెరిగింది. ఒకవైపు పారదర్శకంగా సాగుతున్న లబ్ధిదారుల ఎంపిక, మరోవైపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు, అన్నింటికీ మించి సకాలంలో విడుదలవుతున్న నిధులు ఈ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
దీంతో “మాకూ ఇందిరమ్మ ఇల్లు కావాలి” అంటూ ఊరూరా లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికెళ్లినా దరఖాస్తుల వెల్లువ కనిపిస్తోంది. పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం చూపుతున్న వేగం, పంపిణీ చేస్తున్న నిధుల సరళిని చూసి గతంలో దరఖాస్తు చేసుకోని వారు సైతం ఇప్పుడు కొత్తగా అర్జీలు పట్టుకుని క్యూ కడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
ఇండ్ల కోసం రికార్డు స్థాయిలో 77.68 లక్షల దరఖాస్తులు రాగా, ప్రభుత్వం వీటిపై అత్యంత పారదర్శకంగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హతల ప్రాతిపదికన సాగిన ఈ స్క్రీనింగ్‌లో ప్రాథమికంగా ఎల్ –1 కింద 23.20 లక్షల మందిని గుర్తించారు. వీరంతా సొంత స్థలం ఉండి, నివాసానికి పక్కా ఇల్లు లేని అత్యంత నిరుపేదలుగా సర్కారు తేల్చింది.
మొదటి ప్రాధాన్యత కింద వీరందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 3.50 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, జూన్ నాటికి అందులో దాదాపు 1.32 లక్షల ఇండ్లు పూర్తి స్థాయి నిర్మాణానికి వచ్చాయి.
మరో 68 వేల నుంచి 72 వేల ఇండ్లు ఈ నెలాఖరు నాటికి స్లాబ్ దశకు రానున్నాయి. ఇదే వేగంతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌లో రెండో విడత కింద 2.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
ఇక హైదరాబాద్ (క్యూర్ - కోర్ అర్బన్ రీజియన్) పరిధిలో నిరుపేదల జీవనోపాధి దెబ్బతినకుండా వారి ప్రస్తుత నివాసాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రభుత్వ, భూదాన్ భూములు, మురికివాడలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
నిధుల విడుదలో రాజీ లేదు
గత పాలకుల కాలంలో గృహ నిర్మాణ పథకాలకు భిన్నంగా ఈసారి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. పైగా ఇందిరమ్మ ఇండ్లకు స్థానికంగానే ఉచిత ఇసుకను అందజేస్తోంది. నిర్మాణంలో ఎక్కడా క్వాలిటీ లోపించకుండా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది.
కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా, లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణం ఏ దశకు చేరుకుంటే ఆ దశకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. పనుల పురోగతిని బట్టి నిధులు చకచకా విడుదలవుతుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.6,500 కోట్లకు పైగా నిధుల పంపిణీ
ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం కాగితాలకే పరిమితం కాలేదని నిరూపిస్తూ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 6,500 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయించి, నేరుగా నిధులు ఇస్తుండటంతో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతాయనే భయాలకు తావులేకుండా ప్రభుత్వం ముందస్తుగానే నిధుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ప్రభుత్వ ఆర్థిక భరోసాతో లబ్ధిదారులు ధీమాగా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నారు. మొత్తం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని 4 విడతల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత కింద బేస్‌మెంట్ (పునాది) స్థాయి పూర్తి కాగానే రూ.లక్ష, రెండో విడత కింద రూఫ్ లెవెల్ (గోడల నిర్మాణం) పూర్తయిన తర్వాత రూ. లక్షా 25వేలు, మూడో విడత కింద స్లాబ్ (పైకప్పు) వేయడం పూర్తి కాగానే రూ. లక్షా 75వేలు, చివరిగా నాలుగో విడత కింద ఇల్లు పూర్తిగా నిర్మాణమై, రంగులు ఫినిషింగ్ పనులు ముగిసి గృహప్రవేశానికి సిద్ధమైనప్పుడు రూ. లక్ష చొప్పున విడుదల చేస్తారు. లబ్ధిదారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము పూర్తి చేసిన నిర్మాణ దశల ఫొటోలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసి, జియో-ట్యాగింగ్ పూర్తి కాగానే ఈ నిధులను పొందేలా గృహ నిర్మాణ శాఖ పారదర్శకమైన ఏర్పాట్లు చేసింది
కేంద్రం పైసా ఇయ్యలే
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ. 2 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. కేంద్ర గృహ నిర్మాణ శాఖ నిబంధనల పేరుతో సాంకేతిక కారణాన్ని చూపిస్తూ ఈ నిధులను హోల్డ్‌లో పెట్టింది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులు పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆశించిన రిప్లై రావడం లేదు. అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనప్పటికీ, పేదల ఇండ్ల నిర్మాణ పనులను ఎక్కడా ఆపబోమని, అవసరమైతే ఆ ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
అర్హులందరికీ ఇండ్లు..
ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో మిడిల్ మెన్ లేకుండా..అర్హులకే అందుతున్న ఆర్థిక సాయం చూసి పథకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ జనం తమకూ ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. గ్రామ సభల్లోనూ దీనిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు మంత్రులు, ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారు. అర్హులందరికీ ఇల్లు దక్కే వరకు ఈ పథకం నిరంతర ప్రక్రియగా సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.
ఏడాదిలో గృహప్రవేశం చేశాం
సరిగ్గా ఏడాది కిందట జూన్ 8న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. అదే నెలలో భూమి పూజ చేసి, ఇంటి పనులు ప్రారంభించాం. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి, గత నెల గృహప్రవేశం చేశాం. మొత్తం నాలుగు బిల్లులకు గాను.. రెండు బిల్లులు మంజూరు అయ్యాయి.
- లక్ష్మీ, అడ్డాకుల, మహబూబ్‌నగర్ జిల్లా
సొంతింటి కల నెరవేరింది
నాకు సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయడంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయగలిగాను. ఇప్పటికే గృహప్రవేశం చేశాను ఇంటి నిర్మాణం క్వాలిటీ చాలా బాగుంది. నిర్మాణ సామగ్రికి, మేస్త్రీల పనులకు కూడా డిమాండ్ పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు.
- ఎండీ సోని, చివ్వెంల, సూర్యాపేట జిల్లా
పోటీ పడుతున్నరు
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు గ్రామాల్లో పోటీ పడుతున్నారు. ప్రభుత్వం మొదటి దశలో ఇచ్చిన ఇండ్లకు పునాది దశ నుంచి శ్లాబ్ వరకు పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించడంతో.. రెండో దశలో ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ లబ్ధిదారుల దగ్గరకి క్యూ కట్టడం అశ్చర్యంగా ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఇందిరమ్మ ఇల్లు అంటే నమ్మలేనంత ముచ్చటగా ఉంటోంది.
- పసుమర్తి విశ్వనాధ్, కుప్పెన కుంట్ల గ్రామం, ఖమ్మం జిల్లా
