- నిబంధనలు పెట్టి చేయాలనేది నా అభిప్రాయం: మంత్రి పొంగులేటి
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు తరహాలో ధరణి, భూ భారతి పోర్టల్ అక్రమాలపై విచారణ
- ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర నిధులతోనే ఫైనల్ బిల్లులు
- భూ భారతిని డెలాయిట్‌కు ఇవ్వలేదు.. ఎన్ఐసీ వాళ్లతో ఒప్పందమే ఉంది
- 30-40 ఏండ్లుగా ఇండ్లున్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రెండు సార్లు మంత్రి మండలి సమావేశంలో ఇన్ ఫార్మల్‌గా అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ అంశంపై చర్చించామని, ఇది కీలకమైన పాలసీ మ్యాటర్ కావడంతో మరింత విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
అసైన్డ్భూ కేటాయింపులు పొందిన అసలు లబ్ధిదారుల్లో చాలామంది వాటిని ఇతరులకు విక్రయించుకున్నారని, మరికొందరు ఆ స్థలాల్లో నివాస గృహాలు నిర్మించుకున్నారని గుర్తించినట్టు చెప్పారు. ఎప్పటికైనా ప్రభుత్వం క్రమబద్ధీకరించి రెగ్యులర్ పట్టాలు ఇస్తుందనే ఉద్దేశంతో వ్యాపార ధోరణిలో ఇష్టారీతిన పరిమితికి మించి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారన్నారు. అలాంటి వారి నుంచి ప్రత్యేక ఫీజు వసూలు చేయడం లేదా నిర్దిష్ట ల్యాండ్ మాత్రమే రెగ్యులర్ పట్టా చేసేలా లిమిట్ విధించేలా నిబంధనలు ప్రతిపాదించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.
పట్టా ఉండి కబ్జాలో లేకపోతే రద్దు చేస్తం..
ధరణి, భూ భారతి లావాదేవీల్లో చోటుచేసుకున్న లోపాలపై ఏర్పాటైన ‘స్పెషల్ ఎంక్వైరీ టీమ్’ (సెట్) ఫాస్ట్ ట్రాక్ కోర్టు మాదిరిగా పనిచేస్తుందని, టెండర్ల ప్రక్రియ మొదలుకొని అన్ని రకాల విచారణలను పారదర్శకంగా పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ నుంచి నూతనంగా రూపుదిద్దుకుంటున్న భూ భారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని సమగ్రంగా పరిశీలిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ), డెలాయిట్ సంస్థల మధ్య కేవలం సాంకేతిక సహాయ ఒప్పందం ఉందే తప్ప తమ ప్రభుత్వానికి డెలాయిట్‌తో నేరుగా సంబంధం లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లు సింగిల్ విండోలోకి తీసుకువస్తే అక్రమాలకు తావుండదని భావిస్తున్నట్టు చెప్పారు. రికార్డుల్లో పట్టా ఉండి, క్షేత్రస్థాయిలో కబ్జా లేకపోతే అలాంటి వాటిని రద్దు చేస్తామని, ప్రత్యక్షంగా కబ్జాలో ఉన్న భూమినే ప్రామాణికంగా లెక్కిస్తామని తేల్చిచెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, ఇప్పటివరకు 276 గ్రామాల్లో రీసర్వేతోపాటు ఆబాదీ భూముల సర్వే పూర్తి చేశామని, అక్కడ ఎలాంటి పెద్ద సమస్యలు తలెత్తలేదని అన్నారు. సర్వే పూర్తయిన భూములకు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తున్నామని, ప్రజల నుంచి 2 శాతం లోపే అభ్యంతరాలు వచ్చాయని వివరించారు.
పెరిగిన స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
గృహనిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో వర్షపు నీరు కారుతున్న అంశాన్ని మీడియా దృష్టికి తెచ్చినప్పుడు, వాటికి కూడా పునర్నిర్మాణ మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు విడుదల కాకపోయినప్పటికీ, పేద లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఇక భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వ ఆదాయం అంచనాల కంటే 10 నుంచి 20 శాతం మేర పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.13 వేల కోట్లుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికి రూ.15 వేల కోట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాక్యుమెంట్ల సంఖ్య పెరగడంతో ఆదాయం రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు.
పార్టీకి, ప్రభుత్వానికి మంచి కో ఆర్డినేషన్ ఉంది
కొన్నేండ్ల క్రితమే ఇండ్లు నిర్మించుకున్న నివాసాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సమీక్షిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయ భూముల్లో ఒక్క సెంట్ భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని చెప్పారు. కాకపోతే ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో 30–40 ఏండ్ల నుంచే ఇండ్లు, నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాటిని విచారణ చేసి నిషేధిత జాబితా నుంచి మినహాయిస్తామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకే పాత జాబితాను న్యాయస్థానానికి సమర్పించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి కాలంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరింది? ఏ కారణాలతో చేర్చారు? మళ్లీ ఎవరికి లబ్ధి చేకూర్చడానికి తొలగించారు? అనే ప్రతీ అంశంపైనా సమగ్ర ఆధారాలతో విచారణ జరిపి నిజాలను నిష్పాక్షికంగా ప్రజల ముందు ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ యంత్రాంగానికి మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉందని, పాలన సజావుగా సాగుతోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇన్‌చార్జి మంత్రిగా ఉండటంతో వరంగల్ ప్రజలు తనపై ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదని, రాష్ట్ర ప్రజలందరూ సీఎంపై ఆశలు పెట్టుకున్నట్టే ఇది సహజమైన ప్రక్రియ అని వ్యాఖ్యానించారు
