రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి..కంపెనీ సెక్రటరీలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి..కంపెనీ సెక్రటరీలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
  • ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం కలిసి పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్పొరేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్టిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం కొండాపూర్‌‌‌‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్‌‌‌‌లో నిర్వహించిన ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజిన్ అని వివరించారు. అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ లక్ష్యసాధనలో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు కేవలం నిబంధనల నిపుణులుగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక బోర్డు సలహాదారులుగా మారాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రారంభించిన కాన్‌‌‌‌స్టిట్యూయెన్సీ డెవలప్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)కు నాలెడ్జ్ పార్టనర్‌‌‌‌గా ఉండేందుకు ముందుకు వచ్చిన 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులను మంత్రి అభినందించారు