- ఆ అధికారం ఏ విద్యాసంస్థకూ లేదు
- మల్లారెడ్డి కాలేజీకి హైకోర్టు ఆదేశం
- సర్టిఫికెట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సర్టిఫికెట్లు విద్యార్థికి చెందిన వ్యక్తిగత ఆస్తి అని, వాటిని ఫీజు బకాయిల వసూలు కోసం కాలేజీలు తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదన్న కారణంగా బకాయిల వసూలు కోసం స్టూడెంట్స్ సర్టిఫికెట్లను ఉంచుకునే అధికారం ఏ విద్యాసంస్థకూ లేదని పేర్కొంది. బకాయిలు వసూలు చేసుకోవాలనుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని తేల్చి చెప్పింది.
ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా ధ్రువీకరణ పత్రాలను తనవద్దే ఉంచుకునే అధికారం కాలేజీకి లేదని, సర్టిఫికెట్‌లను వాపసు చేయాలంటూ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫీజు బకాయిలు చెల్లించేదాకా బీటెక్ అడ్మిషన్ సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లను వాపసు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ హనుమకొండకు చెందిన ఇ.చరణ్‌తేజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీటెక్ అడ్మిషన్ సమయంలో ఎలాంటి షరతులు లేకుండా టెన్త్ మార్కుల మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌తోపాటు 6 నుంచి 9వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు, డిప్లొమా మార్కుల జాబితాలను కాలేజీ తీసుకుందన్నారు. బీటెక్ పూర్తయ్యాక ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జూన్ 15న వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
అయితే 2, 3, 4 ఏండ్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదని, అందువల్ల రూ.3.09 లక్షలు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు వాపసు ఇస్తామని చెప్పడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఒకవేళ ఫీజు బకాయి ఉంటే వసూలు చేసుకోవడానికి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని, అంతేగానీ బకాయిలను చూపి సర్టిఫికెట్లను ఉంచుకోవడం చెల్లదని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తీర్పు ప్రతి అందిన వారంలోగా సర్టిఫికెట్లను పిటిషనర్‌కు అందజేయాలని మల్లారెడ్డి కాలేజీకి ఉత్తర్వులు జారీ చేశారు.
