- ఫ్యామిలీ కార్డు, ఆర్టీఏ, ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తులే ఎక్కువ
- మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న మీసేవలో కొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే మీసేవలో 2,20,172 లావాదేవీలు జరిగాయి. సాధారణంగా రోజుకు 70 వేల నుంచి 80 వేల వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా.. ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ (ఆర్టీఏ) సేవలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల అప్లికేషన్లు ఎక్కువగా నమోదయ్యాయి.
వీటితో పాటు రేషన్ కార్డు ఈకేవైసీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగడం ఇదే తొలిసారి అని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సులభంగా, వేగంగా మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ఒకే రోజులో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహించిన ప్రభుత్వ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో మీసేవ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ సేవల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మీసేవలో కొత్త సేవలను చేర్చడంతో పాటు సేవల వేగం, నాణ్యత, పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
