- ఆలయం చుట్టూ 2 కి.మీ పరిధిలో ఆంక్షలు..
- 14 చోట్ల వాహనాల పార్కింగ్
పద్మారావునగర్, వెలుగు : లష్కర్బోనాల పండుగ ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 4న జాతర ముగిసే వరకు ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం వెల్లడించింది.
రెండు రోజులు పూర్తిగా బంద్
ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 4 తెల్లవారుజామున 3 గంటల వరకు పొగాకు బజార్, హమాలీ విగ్రహం నుంచి ఆలయానికి వెళ్లే రూట్లలో, బాటా క్రాస్‌రోడ్స్ నుంచి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్, అడవియ్య క్రాస్‌రోడ్స్ నుంచి హిల్‌స్ట్రీట్ రూట్, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రూట్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. దీనివల్ల కర్బలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పీఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సీటీఓ, ప్లాజా, ఎస్‌బీఐ క్రాస్‌రోడ్స్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ, పార్క్‌లేన్, బాటా, ఘాస్‌మండి, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
మళ్లింపులు ఇవే..
ప్యాట్నీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎస్‌బీఐ, ప్యారడైజ్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను మినిస్టర్ రోడ్, క్లాక్‌టవర్, సంగీత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ మీదుగా మళ్లిస్తారు. ఘాస్‌మండి వద్ద బైబిల్ హౌస్ నుంచి రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను సజ్జన్‌లాల్ స్ట్రీట్ లేదా హిల్‌స్ట్రీట్, రాణిగంజ్ వైపు పంపిస్తారు. బైబిల్ హౌస్, కర్బలా మైదాన్ వద్ద వచ్చే వాహనాలను రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ వైపు తరలిస్తారు. అలాగే, రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలను రాణిగంజ్ నుంచి మినిస్టర్ రోడ్, రసూల్‌పురా, సీటీఓ, సంగీత్ మీదుగా పంపుతారు. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ, గాంధీ దవాఖాన, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సీటీఓ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ వద్ద సింధీ కాలనీ, మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ప్లేస్‌లు ఇవే..
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం14 ప్రదేశాల్లో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిహర కళాభవన్, యశోద పార్కింగ్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ షాపింగ్ మాల్, ఓల్డ్ జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హైస్కూల్, అడవియ్య మెమోరియల్ హైస్కూల్, నల్లగుట్ట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పార్సీ టెంపుల్, వెస్లీ కాలేజీ, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, తాజ్ త్రిస్టార్ లైన్లలో టూ వీలర్లు, ఫోర్‌వీలర్లు పార్క్చేసుకోవచ్చు. ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వీఐపీ వెహికల్స్ ను పార్కింగ్‌కు అనుమతించారు. అత్యవసరమైతే సహాయం లేదా సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ప్రత్యేక బస్సులు
హైదరాబాద్‌సిటీ : లష్కర్ బోనాల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. 2, 3 తేదీల్లో 175 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్, చార్మినార్, కాచిగూడ, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి,బాలాజీనగర్, నాంపల్లి, రిసాలా బజార్, వెంకటాపురం, ఓల్డ్ అల్వాల్, కుషాయిగూడ, చర్లపల్లి, హకీంపేట్, ఓల్డ్ బోయిన్‌పల్లి, సైనిక్‌పురి, సనత్‌నగర్, జామై ఉస్మానియా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బోరబండ, పటాన్‌చెరు నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. దీని కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మట్టి బోనం
సందర్భంగా అమ్మవారికి రాష్ట్రంలోని 32 జిల్లాలకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో పనిచేస్తున్న 175 మంది మహిళా కళాకారులు ఆదివారం మట్టి బోనం సమర్పిస్తారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల ప్రకటించారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమానికి దీనికి పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు.
- సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల
