షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల ప్రమోషన్లు, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల వెలువరించిన చారిత్రాత్మక తీర్పు సామాజిక న్యాయ పోరాటంలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుభేందు సమంతా ధర్మాసనం రిట్ పిటిషన్లలో 2026 జులై 17న ఉమ్మడి తీర్పు వెలువరించింది.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) హైదరాబాద్ బెంచ్ 2024 అక్టోబర్ 21న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ప్రమోషన్లు పొందిన ఎస్సీ/ ఎస్టీ లోకో పైలట్ల సీనియారిటీ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ పరిరక్షణ సూత్రాలను పునరుద్ఘాటించింది. క్యాట్ ట్రిబ్యునల్ చట్టబద్ధంగా స్థిరపడిన సీనియారిటీని రద్దుచేస్తూ తీవ్ర పరిపాలనా లోపం చేసిందని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ తీర్పు సమగ్రతను అర్థం చేసుకోవడానికి సర్వీసు నిబంధనలలో అత్యంత కీలకమైన 'క్యాచ్-అప్ రూల్', 'కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ' భావనలను లోతుగా విశ్లేషించాల్సి ఉంది. గతంలో సుప్రీంకోర్టు విర్పాల్ సింగ్ చౌహాన్ (1995), అజిత్ సింగ్ (1999) కేసులలో ‘క్యాచ్-అప్ సూత్రం’ ప్రతిపాదించింది. ఈ సూత్రం ప్రకారం, రోస్టర్ విధానం ద్వారా ముందస్తు ప్రమోషన్ పొందిన ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగికి ఆ ప్రమోషన్ కేవలం ముందస్తు పదోన్నతి మాత్రమే ఇస్తుంది కానీ శాశ్వత సీనియారిటీని ఇవ్వదు.
ఫీడర్ కేడర్‌లో సదరు ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగి కంటే సీనియర్ అయిన ఓపెన్ కేటగిరీ ఉద్యోగి తదుపరి కాలంలో ప్రమోషన్ పొంది పై కేడర్‌కు వచ్చినప్పుడు, ఆ ఓపెన్ కేటగిరీ ఉద్యోగి తన పాత సీనియారిటీని తిరిగి పొంది ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగి కంటే అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ విధానం వల్ల ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగులు ముందస్తు ప్రమోషన్ పొందినప్పటికీ, తదుపరి ప్రమోషన్లనాటికి మళ్లీ వెనుకబడిపోతూ తీవ్ర అన్యాయానికి గురయ్యారు.
కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ
ఈ అన్యాయాన్ని సరిదిద్ది, రాజ్యాంగబద్ధమైన సామాజిక ప్రాతినిధ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు 85వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 16(4ఎ)లో ‘కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ’ (పరిణామ సీనియారిటీ)అనే పదాన్ని ప్రవేశపెట్టింది. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనగా రిజర్వేషన్ రోస్టర్ ద్వారా ముందస్తు ప్రమోషన్ పొందిన ఎస్సీ/ఎస్టీ ఉద్యోగి సదరు పదోన్నతి పొందిన కేడర్‌లో పొందిన సీనియారిటీ స్థానమే శాశ్వతంగా కొనసాగుతుంది. తదనంతర కాలంలో ప్రమోషన్ పొంది ఆ కేడర్‌లోకి వచ్చే ఓపెన్ కేటగిరీ ఉద్యోగి, ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగి కంటే దిగువన మాత్రమే ఉంటాడు.
అంటే, ముందస్తు ప్రమోషన్‌తోపాటు దాని పర్యవసానంగా వచ్చే సీనియారిటీ ప్రయోజనాలు ఎస్సీ/ఎస్టీ ఉద్యోగికి సంపూర్ణంగా లభిస్తాయి. దీనివల్ల క్యాచ్-అప్ సూత్రానికి ఉన్న చట్టపరమైన ప్రాతిపదిక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆర్.కె. సభర్వాల్, బి.కె. పవిత్ర, ఎం. నాగరాజ్, జర్నైల్ సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సూత్రాల ప్రకారం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది ఆర్టికల్ 16(4ఎ) కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కు. కేవలం ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఓపెన్ మెరిట్ పోస్టులకు పోటీపడే హక్కును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం.
ఫీడర్ కేడర్
ఉద్యోగ నిబంధనలలో ఫీడర్ కేడర్... అంటే ఒక ఉన్నత స్థాయి పదవికి అర్హత సాధించడానికి ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న దిగువ స్థాయి కేడర్ లేదా మూల పోస్టును సూచిస్తుంది. ఉదాహరణకు, తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో 'స్కూల్ అసిస్టెంట్' అనేది 'గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్ -II' పదోన్నతికి ఫీడర్ కేడర్‌గా వ్యవహరిస్తుంది. సేవా నిబంధనల ప్రకారం ఈ ఫీడర్ కేడర్‌లో నిర్ణీత కాలం (సాధారణంగా 3 సంవత్సరాలు) క్రమబద్ధమైన సేవలను పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే తదుపరి ప్రమోషన్‌కు అర్హులుగా పరిగణిస్తారు.
క్యాచ్-అప్, పరిణామ సీనియారిటీ వివాదాలలో ఈ ఫీడర్ కేడర్ అత్యంత కీలకమైనది. సర్వీస్ నిబంధనల ప్రకారం, క్యాచ్-అప్ రూల్, పరిణామ సీనియారిటీ అనేవి రిజర్వేషన్ల ఆధారంగా లభించే ప్రమోషన్లలో ఉద్యోగుల పరస్పర సీనియారిటీని నిర్ణయించే రెండు పరస్పర విరుద్ధమైన న్యాయ సూత్రాలు.
‘క్యాచ్-అప్ రూల్’ ప్రకారం ఒక సాధారణ కేటగిరీ సీనియర్ ఉద్యోగి ఆలస్యంగా ప్రమోషన్ పొందినప్పటికీ, రోస్టర్ పద్ధతిలో అంతకంటే ముందే పదోన్నతి పొందిన ఎస్సీ/ఎస్టీ జూనియర్ ఉద్యోగి కంటే పైస్థాయి కేడర్‌లో తన అసలు సీనియారిటీని తిరిగి పొందుతాడు. దీనికి భిన్నంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4A) ద్వారా లభించిన పరిణామ సీనియారిటీ ప్రకారం, రిజర్వేషన్ ద్వారా ముందే ప్రమోషన్ పొందిన ఎస్సీ/ఎస్టీ ఉద్యోగి ఆ పైస్థాయి కేడర్‌లో తన సీనియారిటీని శాశ్వతంగా నిలబెట్టుకుంటాడు. ఆ తర్వాత ప్రమోషన్ పొంది వచ్చిన సాధారణ కేటగిరీ ఉద్యోగి అతని కంటే జూనియర్‌గానే పరిగణిస్తారు.
సీనియారిటీ వివాదాలతో అన్యాయం
ఈ చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న పరిస్థితులను లోతుగా పరిశీలించాల్సి ఉంది. తెలంగాణలో వేలాది మంది ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్లు, సీనియారిటీ వివాదాల వల్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. అనేక శాఖలలో దశాబ్దాలుగా క్వాంటిఫైయబుల్ డేటా సేకరణ సరిగా జరగలేదు. దీనివల్ల ప్రమోషన్ల ప్రక్రియ న్యాయపరమైన చిక్కుల్లో పడి నిలిచిపోయింది. విద్య, వైద్య, రెవెన్యూ, నీటిపారుదల, రహదారుల విభాగాల వంటి కీలక శాఖల్లో ఎస్సీ/ఎస్టీ అధికారులకు తగిన ప్రాతినిధ్యం లభించక సామాజిక సమతుల్యత దెబ్బతింటోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును తక్షణమే అధ్యయనం చేసి, దానిని ఒక దిశానిర్దేశంగా స్వీకరించాలి. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యంపై శాస్త్రీయమైన క్వాంటిఫైయబుల్ డేటాలను నిర్దిష్ట కాలమితిలో సేకరించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక సాధికార కమిటీని నియమించి, సమగ్ర డిజిటల్ డేటాబేస్ రూపొందించడం ద్వారా నిర్ణీత సమయ పరిమితిలో సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమన్యాయం చేకూర్చేలా స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించడం ద్వారా తెలంగాణ పరిపాలనా రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు.
డా. కట్కూరి, పాలసీ విశ్లేషకుడు
