- రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రసూల్ పుర కిమ్స్ హాస్పిటల్ కు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో మరోసారి అత్యవసర వైద్య సేవల్లో కీలక పాత్ర పోషించింది. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్స్ నుంచి సికింద్రాబాద్ రసూల్‌పురలోని కిమ్స్ హాస్పిటల్‌కు దాత గుండె, ఊపిరితిత్తులను మెట్రో ద్వారా వేగంగా తరలించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రసూల్‌పుర మెట్రో స్టేషన్ వరకు 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేశారు. ఉదయం 11:40 గంటలకు బయల్దేరిన మెట్రో మధ్యాహ్నం 12:05 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో 13 మెట్రో స్టేషన్లను దాటింది. మెట్రో అధికారులు, వైద్య నిపుణులు, ఆసుపత్రి సిబ్బంది సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది.
