ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తెగిన రోడ్లు.. మునిగిన పంటలు..ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్ గంగ

 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తెగిన రోడ్లు.. మునిగిన పంటలు..ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్ గంగ
  •      మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు
  •     కొట్టుకుపోయిన కల్వర్టులు 
  •     పరివాహ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులు పాటు కురిసిన కుండపోత వర్షానికి చాలా గ్రామాల్లో పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. వరద ధాటికి రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగ ఉగ్ర రూపం దాల్చింది. భీంపూర్, భోరజ్, జైనథ్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగిపోగా, ఇండ్లలోకి వరద చేరుతోంది. డొల్లార వద్ద పెన్ గంగా నదిపై ఉన్న బ్రిడ్జి స్లాబ్ ను తాకుతు వరద ప్రవహిస్తోంది. జైనథ్ మండలంలోని ఆనంద్​పూర్ వద్ద పెన్ గంగా నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పెన్ గంగా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

వైద్య సేవలకు దూరం

పోటెత్తిన వరదలతో ఆసిఫాబాద్​ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. గ్రామాలు జలదిగ్బంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్స్ లు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రజలు గోస పడుతున్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రం నుంచి చీలపల్లి వెళ్లే దారిలో వంతెన కోతకు గురైంది. దీంతో  లింబుగూడ, మేడిపల్లి, చిన్న మాలిని, మాలిని, మానిక్ పటారు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

అంచనా వేస్తున్న అధికారులు

నిర్మల్ జిల్లాలోని అనేక మారుమూల గ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కల్వర్టులు, లో లెవెల్ కాజ్వేలు వరదకు కొట్టుకుపోయాయి. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల పరిధిలోని రోడ్లకు భారీగానే నష్టం వాటిల్లింది. అలాగే ఇరిగేషన్ పరిధి లోని పలు కాలువలు, చెరువులు కూడా దెబ్బ తిన్నాయి. పంచాయత రాజ్ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.