- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారుల నాన్-స్టాప్ దాడులు
- డిఫాల్ట్ మిల్లులకే ధాన్యం కేటాయింపు.. అధికారుల పాత్రపై అనుమానాలు!
- మూడు మిల్లులపై కేసులు.. పోలీసుల అదుపులో మిల్లర్లు..
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో పౌరసరఫరాల శాఖ కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించకుండా, వేల కోట్ల విలువైన వడ్లను మిల్లర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి పక్కదారి పట్టిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. గత రెండు రోజులుగా అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఏకంగా రూ. 63.29 కోట్ల విలువైన సీఎమ్మార్ ధాన్యం మాయమైనట్లు తేలింది.
ఆ మూడు ప్రాంతాల్లోని మిల్లులు..
చింతలపాలెం మండలం దొండపాడులోని శివ సుబ్రహ్మణ్యేశ్వర్ మోడరన్ రైస్ మిల్లులో రూ.4.89 కోట్ల విలువైన 2050 మెట్రిక్ టన్నులు, సూర్యాపేటకు చెందిన శివ సాయి రైస్ మిల్లులో దాదాపు రూ.13 కోట్ల విలువ చేసే 2900 మెట్రిక్ టన్నులు, తిరుమలగిరి మండలం అన్నారం గ్రామంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లులో రూ.46 కోట్ల విలువ చేసే 1970.566 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో ఇప్పటికే శివ సాయి రైస్ మిల్లును సీజ్ చేసి కేసు నమోదు చేయగా, మిగతా రెండు మిల్లలపై కూడా తాజాగా కేసులు నమోదు చేసి, మూడు మిల్లులకు సంబంధించిన మిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమాల్లో డిఫాల్ట్ మిల్లులే టాప్..
ఈ అక్రమాలకు పాల్పడిన వాటిలో గతంలోనే డిఫాల్ట్ గా తేలిన మిల్లులే అధికంగా ఉండటం గమనార్హం. ప్రతినెలా క్షేత్రస్థాయిలో నిల్వలను పరిశీలించాల్సిన సివిల్ సప్లై అధికారులు, కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడచిన కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఎగ్గొట్టి డిఫాల్ట్ జాబితాలో ఉన్న మిల్లులకు, నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ ధాన్యం ఎలా అలాట్ చేశారనే కోణంలో విజిలెన్స్ టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి.
కొనసాగుతున్న దాడులు..
జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు ఇంకా నాన్-స్టాప్‌గా కొనసాగుతున్నాయి. గోదాముల్లో అసలు బియ్యం లేకపోయినా బస్తాలు ఉన్నట్లు నమ్మించేందుకు మిల్లర్లు వేస్తున్న ఎత్తుగడలను అధికారులు తిప్పికొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో పాటు వారికి సహకరించిన పౌరసరఫరాల శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
