హైదరాబాద్, వెలుగు: వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అటార్నీ జనరల్ ఆఫ్ఇండియా డాక్టర్ ఆర్. వెంకటరమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలు సత్యం, జ్ఞానం, న్యాయం కోసం నిరంతరం అన్వేషించే వేదికలుగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలో నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని, గ్రీన్‌కో ఫౌండర్ మహేశ్ కొల్లి, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు.
రాజీవ్ నన్నపనేని మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు చేయాలని సూచించారు. మహేశ్ కొల్లి మాట్లాడుతూ.. గ్లోబల్ క్లీన్ ఎనర్జీలో భారత్ ప్రపంచానికే నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మణిశర్మ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్‌గా జన్మించడం తన అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిషోర్ 2,599 మంది విద్యార్థులకు డిగ్రీలు, 63 మందికి బంగారు పతకాలు అందజేసినట్టు వెల్లడించారు.
విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును మార్చగలదని, దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా, వాటిని సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
