- యూనివర్సిటీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు బీసీ సంఘాల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాల నియామకాలలో సామాజిక న్యాయం పాటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. శనివారం ఆయన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు పీసీసీ చీఫ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జేఎన్టీయూ చరిత్రలో తొలిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ప్రొఫెసర్ జయలక్ష్మి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారని నేతలు తెలిపారు.
అయితే, ఆమె బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆ పదవి నుంచి తప్పించేందుకు ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, బోధన, బోధనేతర సిబ్బంది అంతా ప్రొఫెసర్ జయలక్ష్మికి మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు. వీసీ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం అడ్డుపడకుండా చూసి, ఆమె అదే పదవిలో కొనసాగేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల గణన ఆధారంగా అన్ని రంగాల్లో తగిన వాటా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
వర్సిటీల్లోని కీలక పోస్టుల నియామకాలలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60% పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాన వర్సిటీల్లో రెండు సామాజిక వర్గాల వారికే వీసీ, రిజిస్ట్రార్ పదవులు దక్కాయని, అరుదుగా ఒక బీసీ మహిళకు దక్కిన అవకాశాన్ని కూడా ఊడగొట్టాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
