మహా పాలిటిక్స్‎లో మరో సంచలనం.. షిండే వర్గంలోకి ఏడుగురు శివసేన యూబీటీ ఎంపీలు..?

మహా పాలిటిక్స్‎లో మరో సంచలనం.. షిండే వర్గంలోకి ఏడుగురు శివసేన యూబీటీ ఎంపీలు..?

ముంబై: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో భారీ ఎదురు దెబ్బ తగలబోతుందా..? శివసేన పార్లమెంటరీ పార్టీ నిలువునా చీలబోతుందా..? అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరబోతున్నారంటూ మహా పాలిటిక్స్‎లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో శివసేన నాయకుడు, మాజీ ఎంపీ-ఎమ్మెల్యే కృపాలు మానే బిగ్ బాంబ్ పేల్చాడు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందే ఏడుగురు శివసేన యూబీటీ ఎంపీలు షిండే వర్గంలో చేరుతారని జోస్యం చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ ప్రారంభం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ టైగర్‎లో భాగంగా మొదట ఎంపీల చేరికలు ఉంటాయని.. ఆ తర్వాత ఎమ్మెల్యేల జాయినింగ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 16 మంది ఉద్ధవ్ థాక్రే వర్గం ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం 16 మంది ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గం గూటికీ చేరుతారని పేర్కొన్నారు. 

షిండే వర్గం చేపట్టిన ఆపరేషన్ టైగర్‎ను ప్రజలు త్వరలోనే చూస్తారని అన్నారు. ఆపరేషన్‎కు ముందు పేషెంట్‎ను క్షుణ్ణంగా పరీక్షించినట్లే.. ఆపరేషన్ టైగర్‎కు ముందు కూడా ఇలాంటి కసరత్తు జరిగిందని తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ జరగనుందని.. ఈ ఆపరేషన్‎కు డాక్టర్  ఏక్‌నాథ్ షిండే అని కీలక వ్యాఖ్యలు చేశారు. షిండే నేతృత్వంలో జరుగుతోన్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.